ఉత్తరాఖండ్‌లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు..?

ఉత్తరాఖండ్‌లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు..?

దేశానికి జీవనాడులైన గంగా,యమున నదులకు పుట్టినిల్లు. హరిద్వార్,రిషికేశ్,బద్రీనాథ్,కేదార్‌నాథ్ వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు నిలయమైన ఉత్తరాఖండ్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది.రెండు ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ,కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.5 లోక్‌సభ స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఈ నెల 11న ఎన్నికలు జరుగనున్నాయి.

ఇంతకీ ఉత్తరాఖండ్ లో 5 లోక్ సభ స్థానాలు ఉన్నాయి.ఓటర్లు దాదాపు 77 లక్షల మంది ఉన్నారు.గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది.కాంగ్రెస్ ఖాతా కూడా తెరువలేదు.అయితే 2009 ఎన్నికల్లో హస్తం పార్టీ మొత్తం అన్ని స్థానాలను గెలుచుకోవడం విశేషం.

ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయి 2000 నవంబర్ 9న ఉత్తరాఖండ్ 27వ రాష్ట్రంగా ఆవిర్భవించింది.తొలుత దీన్ని ఉత్తరాంచల్‌గా పిలిచేవారు.రాష్ట్ర భూభాగంలో దాదాపు 85 శాతం పర్వత ప్రాంతాలతో కూడుకుని ఉంది.ఇక్కడ మొదటి నుంచీ కాంగ్రెస్,బీజేపీల మధ్యే అధికారం మారుతూ వస్తున్నది.అయితే ఈ మధ్య 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.త్రివేంద్ర సింగ్ రావత్ ముఖ్యమంత్రి అయ్యారు.

అయితే లోకసభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని బీజేపీ పట్టుదలతో ఉంది.ప్రధాని మోదీ చరిష్మా,సుపరిపాలన,జాతీయవాదాన్ని బీజేపీ ప్రచారాస్ర్తాలుగా చేసుకుంది.పుల్వామా ఉగ్రదాడి అనంతర పరిణామాలు తమకు కలిసి వస్తాయని భావిస్తున్నది.మాజీ సైనికాధికారులు అధికంగా ఉండే కాంగ్రా, హమీర్‌పూర్ ప్రాంతాల్లో బీజేపీకి కలిసివచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో రాజ్‌పుత్‌లు,బ్రాహ్మణుల ప్రాబల్యం ఎక్కువ.

అయితే ఇప్పటివరకు రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ ఈ రెండు సామాజికవర్గాలకు చెందిన వారే కావడం గమనార్హం.అగ్రవర్ణాల్లోని పేదలకు విద్య,ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మోదీ సర్కారు చట్టం తీసుకురావడం బీజేపీకి కలిసివచ్చే అవకాశం ఉన్నది.రాష్ట్రంలో ఐదు లోక్‌సభ స్థానాల గుండా వెళ్లే చార్‌దామ్ రోడ్డు నిర్మాణం ఎన్నికల్లో తమకు లాభిస్తున్నదని కాషాయపార్టీ ఆశలు పెట్టుకున్నది.

అయితే బీజేపీ జోరుకు కళ్లెం వేయాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నది.మాజీ సీఎం హరీశ్ రావత్ నేతృత్వంలో ఆ పార్టీ ఎన్నికలకు వెళుతున్నది.అయితే పార్టీలో నెలకొన్న అంతర్గత పోరు కాంగ్రెస్‌కి తలనొప్పిగా మారింది.ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలు ఎవరికి వారు యాత్రలు చేపట్టారు.నిరుద్యోగం,-సరైన రహదారులు లేకపోవడం,-తాగునీటి ఎద్దడి,-వ్యవసాయ సంక్షోభం లాంటి అంశాలు కాంగ్రెస్ కు కలిసొచ్చే అవకాశం ఉంది.ఇక బీజేపీ సిట్టింగ్ ఎంపీ బీఎస్ ఖండూరి కుమారుడు ఇటీవల పార్టీలో చేరడం కూడా కాంగ్రెస్‌కు కలిసివచ్చేదే.

ఏదేమైనా ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్,బీజేపీ రెండు పార్టీలకు అనుకూల,ప్రతికూల అంశాలు సమాన స్థాయిలో ఉన్నాయి.ఏ పార్టీ ఇక్కడ జెండా ఎగురవేస్తుందనే విషయం తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *