ఏపీలో మొదలైన కోడిపందేలు...కోట్లలో బెట్టింగులు

ఏపీలో మొదలైన కోడిపందేలు...కోట్లలో బెట్టింగులు
సంక్రాంతి పండుగ అంటే కోడిపందేల సందడి అంతాఇంతా కాదు. భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో ఏకంగా వందల కోట్ల మేర పందేలు జరగొచ్చని అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే రూ.100 కోట్ల పందెం జరిగాయని అనధికార అంచనా. కోడిపందాలు ఆడడం నేరం పందాలు జూదాలపై నిషేధం ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అంటూ కోర్టులు ఆదేశిస్తున్నా ఖాకీలు ఉక్కుపాదం వేసి తొక్కేస్తామంటూ హెచ్చరికలు జారీచేస్తున్నా ఇవన్నీ నేతల మొండిపట్టు ముందు నిలవలేకపోతున్నాయి.
 
 ఎప్పటిలా ఈ ఏడాది కూడా కోడిపందాలకు బరులు సిద్దమైపోయాయి ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఐ.పోలవరం మండలంలోని ముర మళ్ళ పశ్చిమలోని భీమవరం – విశాఖ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ ఎత్తున పందేలకు సిద్ధమయ్యారు. కోనసీమలో గన్నవరం – రాజోలు – లంక ప్రాంతాలు కొత్తపేట – రావులపాలెం – అంబాజీపేట – ఆత్రేయపురం – లొల్ల – ధవళేశ్వరం – వేమగిరి – రాజమహేంద్రవరం రూరల్ – కడియం – అనపర్తి – మండపేట – రామచంద్రపురం – ద్రాక్షారామ తదితర ప్రాంతాలతోపాటు దివాన్ చెరువు – సీతానగరం – గోకవరం – జగ్గంపేట – ప్రత్తిపాడు – తుని – పిఠాపురం – కాకినాడ రూరల్ – అచ్చంపేట తదితర ప్రాంతాల్లో కోడిపందాలు జోరుగా సాగుతాయి. అలాగే ప్రతీ నియోజకవర్గంలోనూ ఓ చోట పందెంబరులు ఏర్పాటుచేసిన సందర్భాలుండగా ఈ ఏడాది మండలంలో కూడా తాము బరులు నిర్వహిస్తామంటూ ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల వద్ద అనుచరులు చెబుతున్నట్లు సమాచారం. దీంతో ఆయాచోట్ల కూడా ఏర్పాట్లు వేగవంతం చేసారు.

అశ్లీల నృత్యాలు

 కోడిపందాలతో పాటు అశ్లీల నృత్యాలు – బెల్టుషాపులు ఇలా వేటికవే నిర్వహణకు వేలంపాటలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున పందేలు జరిగే ప్రదేశాలకు పోలీసులు వెళ్ళాలంటే జిల్లాస్థాయి అధికారులకు స్థానిక పోలీసు అధికారుల సహకారం ఉండాలి. జిల్లాస్థాయి పోలీసులు పందాలు అడ్డుకోవాలన్నా దానికి మండల సర్కిల్ స్థాయిలో పోలీసుల నుండి సహకారం లభించాలి. వారు సహకరించనప్పుడు ప్రజాప్రతినిధులతో తగువులు పెట్టుకోవడం ఎందుకన్న భావన పోలీసుల్లో వ్యక్తమవుతోంది.
 
 కోడిపందాలు నిషేధించాలంటూ ఏపి ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గత ఏడాది రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించగా సర్వోన్నత న్యాయస్థానం పొలాల్లోకి వెళ్ళి కోళ్ళను పట్టుకోకూడదంటూ సూచించింది. కోడిపందాలు నిర్వహించే పొలాల రైతులను అరెస్ట్ చేయవద్దని స్పష్టంచేసింది. పందాలు ఆడుకోవచ్చన్న మాటను ఎక్కడా పేర్కొనలేదు. పందెంకోళ్ళకు కోడికత్తి కడితే ఊరుకోమంటూ పోలీసులు నానాహంగామా సృష్టించారు.

యధేచ్చగా

 కాగా ఇవన్నీ హైటెన్షన్ క్రియేట్ చేయగా గత ఏడాది ఎక్కడపడితే అక్కడ కోడికత్తులు కట్టి బరులు నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలు యధేచ్చగా సాగాయి. పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించారు. కొన్నిచోట్ల ఒత్తిళ్ళు – ఇంకొన్నిచోట్ల మామూళ్ళు అందుకున్నారు. ప్రతీచోటా కోడిపందాలను ఆయా నియోజకవర్గ ప్రజాప్రతినిధులే ప్రారంభోత్సవాలు చేసి కోళ్ళతో ఫొటోలు దిగి మరీ సవాల్ విసిరారు. ఈసారీ అదే పరిస్థితి.
 
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *