పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించిన సీఎం జ‌గ‌న్‌

పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించిన సీఎం జ‌గ‌న్‌

ఏపీ జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం చేరుకున్న జగన్.. ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ సైట్‌ను సందర్శించిన జగన్.. పనుల పరోగతి, నిర్మాణంపై అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. కాపర్‌ డ్యామ్‌ పనులు పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వరద వచ్చే నాటికి పనులు ఎందుకు పూర్తి చేయలేదన్న సీఎం.. ఎక్కువ వరద వస్తే పరిస్థితి ఏంటని అధికారుల్ని ప్రశ్నించారు. అంతేకాదు.. కాపర్‌ డ్యామ్‌ కారణంగా నీరు స్పిల్‌వేపైకి వచ్చి నిర్మాణాలకు ఆటంకం కల్గితే ఎలా అని అడిగారు.
ఇక ప్రాజెక్టు వద్ద అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు. నిర్వాసితులకు పరిహారం పెంపు విషయాన్ని పరిశీలించాలని ఆదేశించారు. వచ్చే నాలుగు నెలల్లో ఏయే పనులు చేయగలరంటూ అధికారులను ముఖ్యమంత్రి ప‍్రశ్నించగా.., స్పిన్‌ ఛానెల్‌ ఏటిగట్లను పటిష్టపరుస్తామని తెలిపారు. ఇక డ్యామ్‌ పూర‍్తయిన పది నెలలలోపు హైడ్రాలిక్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని సమావేశంలో కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రికి తెలిపారు. 2021 ఫిబ్రవరి నాటికి ప్రధాన జలాశయాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

వచ్చే 2021 సంవత్సరాని కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని అధికారులు చెప్పారని జలవనరుల శాఖామంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. పనులు దశలవారీగా పూర్తయ్యే తీరును అధికారులు వివరించారని, నాలుగు నెలల కాలంలో చేయాల్సిన పనులను పరిశీలించామని పేర్కొన్నారు. కాపర్‌ డ్యామ్‌ పనులు సరిగ్గా జరగలేదని, వరదల సమయంలో 113 గ్రామాలకు చెందిన నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారని చెప్పారు మంత్రి అనిల్ కుమార్.

మొత్తానికి సీఎం హోదాలో తొలిసారి పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్‌.. నిర్వాసితులకు పరిహారం చెల్లించే విషయంపై పరిశీలన జరపాలని అధికారులను ఆదేశించారు. పోలవరం పనులపై నిపుణుల కమిటీతో ఆడిటింగ్‌ నిర్వహిస్తామని ప్రకటించారు. ఏదీ ఏమైనా ప్రజలకు మేలు చేయాలనే ప్రభుత్వం తమదని, తాము పాజిటివ్‌ ఆలోచనలతో ఉన్నామన్నారు వైసీపీ నేతలు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *