రక్తసిక్తమైన అమిత్‌ షా రోడ్‌షో

రక్తసిక్తమైన అమిత్‌ షా రోడ్‌షో

కోల్‌కతాలో అమిత్‌ షా నిర్వహించిన రోడ్‌షో రక్తసిక్తంగా మారింది. ముందుగా కూల్‌ ప్రారంభమైన రోడ్‌షో.. కొన్ని ప్రాంతాలకు చేరుకోగానే ఘర్షణలకు దారితీసింది. బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఎం కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. షా ప్రయాణిస్తున్న వాహనంపైకి కొందరు కర్రలు విసరడంతో గొడవ మొదలైంది. చివరికి ఇది కాస్త భారీ విధ్వంసానికి దారితీసింది.

బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నడుమ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కోల్‌కతాలో భారీ రోడ్‌షో నిర్వహించారు. రోడ్ షో దారి మధ్యలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. అమిత్ షా రోడ్ షో యూనిర్సిటీ ఆఫ్ కొల్ కతా వద్దకు రాగానే ఒక్కసారిగా గొడవ మొదలైంది. బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలు విసురుకున్నారు. యూనివర్సిటీ ఎదుట నిలబెట్టిన వాహనాలకు ఆందోళనకారులు నిప్పంటించారు. ఈ ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు.

కోల్‌కతాలోని విద్యాసాగర్ కాలేజీ దగ్గర కొందరు విద్యార్థులు అమిత్ షా కాన్వాయ్‌పై రాళ్లు విసరడంతో బీజేపీ కార్యకర్తలు ఊగిపోయారు. కాలేజీ సమీపంలో ఉన్న ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రోడ్డు పక్కన ఉన్న వాహనాలకు కొందరు నిప్పంటించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగడంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి చెదరగొట్టారు.

ఈ ఘటనతో కోల్‌కతా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరువర్గాలను చెదరగొట్టి… భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి లభిస్తున్న ఆదరణ ఓర్వలేక టీఎంసీ దాడులకు పాల్పడుతోందని అమిత్ షా ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలపై టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ దాడులు చేయిస్తోందని విమర్శించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *