దుమారంరేపుతున్న చింతమనేని వ్యాఖ్యలు

దుమారంరేపుతున్న చింతమనేని వ్యాఖ్యలు

పాలకులకు ప్రజలంటే ఎప్పడూ చిన్నచూపే. ప్రజల్ని తమ దయాదాక్షిణ్యాలపై ఆధారపడే వాళ్లుగా చూడడం నేతలకు పరిపాటుగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడందుకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నాయి. కుల దురహంకారంతో దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారు అధికార పార్టీ నేతలు. దెందలూరు ఎమ్మెల్యే తాజా వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.

దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ చౌదరి మరో వివాదంలో చిక్కుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరం జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఇటీవల చింతమనేని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దళితులను అసభ్య పదజాలంతో దూషించారు. రాజకీయాలు చేసేది, పదవులు అనుభవించాల్సింది మేమే అంటూ కుల అహంకారాన్ని ప్రదర్శించారు. “మీరు దళితులు, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు, వెనుకబడిన తరగతుల వాళ్ళు. మీకెందుకు రా పదవులు” అంటూ అవమానించారు. చింతమనేని వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో దుమారంరేపుతున్నాయి.

దళితుల్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసే నేతలకు వారిని మనుషులుగా గుర్తించడానికి మనసొప్పదు. అందుకే.. అట్టడుగు కులాలు, వర్గాల ప్రజలెప్పుడూ తమ పాదాల చెంతే ఉండాలనుకుంటారు. పెత్తనం తమ చేతిలోనే ఉండాలనుకుంటారు. దళితులకు అధికారం దక్కకూడదనుకుంటారు. చింతమనేని వ్యాఖ్యలు అచ్చంగా ఈ కులదురహంకారానికే నిదర్శనం. చింతమనేని తీరుపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అగ్రకుల అహంకారంతో దళితులను అవమానించిన చింతమనేనిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

దళిత సంఘాల ఆందోళనకు ప్రతిపక్ష పార్టీ మద్దతు ప్రకటించింది. కాగా చింతమనేని తనను తాను సమర్థించుకునే పనిలోపడ్డాడు. తానేమీ తప్పు చేయలేదంటూ దబాయింపుకు దిగాడు. తనపై సోషల్‌ మీడియాలో దుష్ర్పచారం చేస్తున్నారంటూ ఏలూరులో ఆందోళన చేపట్టాడు. వైసీపీ ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తోందంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. కాగా.. చింతమనేని తప్పును కప్పిపుచ్చుకునేందుకు యత్నిస్తున్నాడని వైసీపీ నేతలు అంటున్నారు.

ఒక్క చింతమనేని మాత్రమే కాదు.. ఎందరో రాజకీయ నేతలు దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. ప్రజల్ని అవమానించడమంటే రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడమే అంటున్నారు విశ్లేషకులు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *