ఆపరేషన్‌ థియేటర్‌కు డాక్టర్‌ రాకుండానే సర్జరీ

ఆపరేషన్‌ థియేటర్‌కు డాక్టర్‌ రాకుండానే సర్జరీ

డాక్టర్‌ లేకుండానే ఆపరేషన్‌ చేయొచ్చా? వేల కిలోమీటర్ల దూరం నుంచే టెలీ సర్జరీ చేసేందుకు వీలవుతుందా? కేవలం రిమోట్‌ కంట్రోల్‌తోనే బ్రెయిన్‌ ఆపరేషన్‌ చేయడం సాధ్యమేనా? కాల్పనిక చిత్రాల గురించి చెబుతున్నారని లైట్‌ తీసుకోకండి..చైనాలో జరిగిన వినూత్న ఆపరేషన్‌ గురించే తెలిస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే..ఇది కల లేక నిజమా అని సంభ్రమాశ్చర్యాలకు గురికావాల్సిందే..

మానవ మేధస్సు సరికొత్త అద్భుతాలను ఆవిష్కరిస్తోంది..రాకెట్‌లా దూసుకుపోయే ఆలోచనలతో అసాధ్యమనుకున్నవి సుసాధ్యం చేస్తోంది..చైనాలో 5జీ టెక్నాలజీతో రిమోట్‌ కంట్రోల్‌తో చేసిన టెలీ సర్జరీ ప్రపంచంలోనే సంచలనం రేపుతోంది..వైద్యరంగంలోనే విప్లవాత్మక మార్పుకు తెరలేపింది.

చైనా రాజధాని బీజింగ్‌ పీఎల్‌ఏ ఆస్పత్రి టెలీ సర్జరీలో రికార్డ్‌ క్రియేట్‌ చేసింది..మూడు గంటల పాటు జరిగిన మెదడు సంబంధిత శస్త్రచికిత్స సక్సెస్‌ అయ్యింది. అయితే ఆపరేషన్‌ థియేటర్‌కు డాక్టర్‌ రాకుండానే ఈ ఘనత సాధ్యమైంది..పేషెంట్‌కు దూరంగా సుమారు 3,000 కిలోమీటర్ల దూరంలోని దక్షిణ హైనన్‌ ద్వీపంలో వైద్యుడు ఉన్నాడు. అక్కడి నుంచి శస్త్రచికిత్సను విజయవంతంగా చేశాడు. ప్రపంచంలోనే తొలిసారిగా 5జీ టెక్నాలజీని వినియోగించుకుని లింగ్‌ జీపీ అనే డాక్టర్‌ రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా రోగి మెదడులోకి న్యూరోస్టిమ్యులేటర్‌ను ఎక్కించాడు. అంతేకాదు ఆపరేషన్‌ థియేటర్‌లోని అన్ని పరికరాలను అక్కడి నుంచే ఆపరేట్‌ చేశాడు. పార్కిన్సన్‌ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి బీజింగ్‌లోని పీఎల్‌ఏ జనరల్‌ ఆస్పత్రిలో చేరాడు.

చైనాకు చెందిన హవాయీ మొబైల్‌ కంపెనీ రూపొందించిన 5జీ టెక్నాలజీకి కంప్యూటర్‌ను అనుసంధానం చేశారు. దీని ద్వారా డాక్టర్‌ లింగ్‌ జీపీ శస్త్రచికిత్స నిర్వహించాడు. ఎదురెదురుగా ఉన్నప్పుడు వ్యక్తుల మధ్య సమాచారం ఎంత సమయంలో చేరుతుందో..ఈ టెక్నాలజీతో ఎంత దూరంలో ఉన్నా కూడా అంతే సమయంలో చేరుతుందట. కనీసం మిల్లీ సెకను తేడా కూడా ఉండదట. అదే 4జీ టెక్నాలజీలో వీడియో కాలింగ్‌ చేస్తే కాస్త ఆలస్యం అవుతుంది. అందుకే 4జీని శస్త్రచికిత్సలకు వాడలేదు. మరోవైపు సర్జరీ చేస్తున్నంత సేపు రోగి 3 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు ఒక్కసారి అనిపించలేదన్నారు డాక్టర్‌ లింగ్‌. రిమోట్‌ కంట్రోల్‌తో బ్రెయిన్‌ సర్జరీ చేయడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి అని చెబుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *