కొద్ది కొద్దిగా కోలుకుంటున్న "దేశం"

కొద్ది కొద్దిగా కోలుకుంటున్న "దేశం"

ఓటమి తెచ్చిన అవమాన భారం నుంచి తెలుగుదేశం పార్టీ తొందరగానే కోలుకున్నట్టు కనిపిస్తో్ంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సహా పలువురు నేతలు క్రమ క్రమంగా గొంతులు సవరించుకుంటుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో వివిధ మంత్రిత్వ శాఖలలో జరిగిన అవినీతిని బయటకు తీయాలని సీఎం జగన్ ఇప్పటికే స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు కూడా ఈ మేరకు తమ పనులు ప్రారంభించనట్టు కనిపిస్తోంది. సీఎం జగన్ కూడా వివిధ పనుల మీద వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.

మేము అలా చేయలేదు అంటున్నారు!

ఇప్పుడు ఇదే అంశం టీడీపీ నేతలలో గుబులు పుట్టిస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాము మరీ మౌనంగా ఉండడం మంచిది కాదని సీనియర్ నేతలు చంద్రబాబుకు సలహా ఇచ్చారని చెబుతున్నారు. దీంతో టీడీపీ కొత్త ఎత్తుగడను అవలంబిస్తోందని అంటున్నారు. ఈ పది రోజల పాలనలోనే సీఎం జగన్ కు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభించాయి. మరోవైపు సీఎం కొంత దూకుడుగానే వెళ్తున్నారు. ఈ పరిణామాలు తమకు భవిష్యత్తులోనూ తీవ్ర నష్టం కలుగజేసే అవకాశాలు ఉంటాయని టీడీపీ నేతలు భావిస్తున్నారని సమాచారం. దీనిని అడ్డుకునేందుకే టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని అంటున్నారు. అందులో భాగంగానే, విచారణ పేరిట రాజధానిలో అభివృద్ధి పనులను నిలిపివేస్తున్నారని, సాగునీటి ప్రాజెక్టుల పనులను ఆపివేస్తున్నారని అంటూ టీడీపీ నేతలు ఆరోపణలు ప్రారంభించారు. వైఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను తాము కొనసాగించామని గుర్తు చేస్తున్నారు. అవినీతి జరిగిందని అనుకుంటే విచారణ చేసుకోండి..కానీ, పనులను ఆపవద్దు అన్న విధంగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు.

ఎంత చేసినా లాభం లేదంట!!

కొత్త ప్రభుత్వం దూకుడును తగ్గించే యత్నంలో భాగంగానే టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా ఇలా మాట్లాడుతున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జగన్ సర్కారు అభివృద్ధి పనులను అడ్డుకుంటోందనే భావనను కలిగించడానికే వారిలా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. కానీ, ఇప్పుడప్పుడే టీడీపీ మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని, జగన్ వేగానికి తిరుగు ఉండకపోవచ్చనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఏపీలో అధికార, విపక్షాల మధ్య మెలమెల్లగా వేడి రాజుకున్నట్టే కనిపిస్తోందని అంటున్నారు. దీనంతటికి కారణం జగన్ సర్కారు విచారణ అంటూ మొదలుపెడితే తమకు చీకాకులు తప్పవని టీడీపీ నేతలు భావించడమేనని చెబుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎలాంటి పాత్ర పోషిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *