చంద్రబాబు చక్రం తిప్పేస్తున్నారు

చంద్రబాబు చక్రం తిప్పేస్తున్నారు

రాహుల్ గాంధీని లైమ్ లైట్లోకి తేవడం ద్వారా ఏపీలో పాలిటిక్స్ ను పక్కా అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు . 2014లో టీడీపీ కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఎంతగా ప్రచారం చేసిందో అదే ఫార్ములాను బీజేపీ పైకి ప్రయోగించనున్నారు. మొత్తం సమీకరణలు మార్చడం ద్వారా కాంగ్రెసు పార్టీని అభయహస్తం చేసుకోవాలనుకుంటున్నారు.అయినప్పటికీ దేశంలో విభిన్న శక్తులను కలిపేందుకు తప్పనిసరి అవసరంగా చంద్రబాబుకు చేయూతనిస్తున్నారు రాహుల్. ఇకపై బాబు వ్యూహం మూడు దశల్లో ఉండబోనుంది.

chandrababu  vision 2019

దేశంలో విభిన్న శక్తులను కలిపే దిశగా చంద్రబాబు

మరోవైపు దేశంలో కీలకమైన రాజకీయ పక్షాలన్నిటితో చంద్రబాబు కి సన్నిహిత సంబంధాలున్నాయి. కేసీఆర్ సెక్యులర్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ అంటూ ప్రకటన చేసినప్పుడు ముందుగా గుర్తుకొచ్చిన పేరు చంద్రబాబుదే.గతంలో తృతీయఫ్రంట్ ను నడిపిన అనుభవమూ ఉంది. అందువల్ల కేసీఆర్ తో పోలిస్తే చంద్రబాబు బెటర్ ఛాయిస్ అన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయినప్పటికీ కేసీఆర్ రెండు మూడు పర్యటనలతో హడావిడి చేశారు. అనుకున్నస్థాయిలో స్పందన లభించలేదు. మారిన పరిస్థితుల్లో మళ్లీ చంద్రబాబు పాత్ర చర్చనీయమైంది. మోడీకి వ్యతిరేకంగా మూడో కూటమికి తెరతీస్తారని భావించారు. ఇది ఓట్ల చీలికకే తప్ప బీజేపీకి ప్రత్యామ్నాయం కాబోదని చంద్రబాబు గ్రహించారు. దాంతో ప్రాంతీయ శక్తులను కలిపి కాంగ్రెసు నేతృత్వానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు.

బీజేపీని గురిపెట్టేలా వ్యూహం

మూడో ప్రత్యామ్నాయం మాట లేకుండా, కాంగ్రెసు భుజం పై తుపాకీ పెట్టి బీజేపీని గురిపెట్టేలా ప్రాంతీయశక్తులను ఒకతాటిపై తేవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు… ఇందుకుగాను రాష్ట్రాల వారీ అనుకూలించే శక్తుల సమీకరణకు పూనుకుంటున్నారు. శరద్ పవార్, శరద్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ , మాయావతి వంటివారితో ఇప్పటికే తొలి దశ చర్చలు పూర్తిచేశారు. బీజేపీ పాతుకుపోతే ప్రాంతీయ పార్టీల అస్తిత్వం ప్రశ్నార్థకమవుతుందన్న దిశలో చర్చలు నడిపారు.

దక్షిణాది లో బలం పుంజుకుంటున్న కాంగ్రెస్

ఇక దక్షణాదిలో కాంగ్రెసు బలం పుంజుకొంటోంది. కర్ణాటకలో జేడీఎస్, తమిళనాడులో డీఎంకేలు ఇప్పటికే యూపీఏకి ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములు. ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్సులూ అంతే. ఎస్పీ, బీఎస్పీ, లను దారికి తేవాలనే ప్రయత్నంలో ఉన్నారు. అదే జరిగితే ఒక బలమైన కూటమి ఏర్పాటైనట్లే. ఇందులో కొన్ని పార్టీలకు కాంగ్రెసుతో సత్సంబంధాలు లేవు. వాటిని ఒప్పించి, తాత్కాలికంగా ఎన్నికల వరకూ అయినా కలిసినడిచేట్లుగా యూపీఏ లో తన మార్క్‌ రాజకీయాలను తీసుకు వచ్చే పనిలో ఉన్నారు..అందుకే నేటి నుంచి దక్షిణ భారత పార్టీల నేతలను కలబోతున్నారు….

జనవరిలో రాహుల్‌ను ఏపీకి ఆహ్వానించిన బాబు

ఇటు రాహుల్ గాంధీని జనవరిలో ఆంధ్రప్రదేశ్ కు ఆహ్వానించి, ధర్మపోరాట దీక్షలో భాగంగా ప్రత్యేక బహిరంగ సభను నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సభలో ప్రత్యేకహోదా అంశంపై ప్రకటన చేయిస్తే రాజకీయ ప్రయోజనం దక్కుతుందని భావిస్తున్నారు చంద్రబాబు. ఈ ప్రకటన ద్వారా టీడీపీకి మంచి మైలేజీ రావడమే కాదు కాంగ్రెసుపై ఉన్న నెగిటివ్ ఫీలింగ్ ప్రజల్లో తగ్గుతుంది. తెలంగాణ తరహాలో ఏపీలో సైతం కాంగ్రెసుతో పొత్తుకు రెడీ అవ్వోచ్చు. దీంతో 2014 ను రిపీట్ చేయవచ్చనేది టీడీపీ అధినేత ఆశాభావం. మరి చంద్రబాబు వ్యూహం వర్కౌట్‌ అవుతుందా..? చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *