కుప్పంలో చంద్రబాబుకు ఎంత మెజారిటీ వస్తుంది?

కుప్పంలో చంద్రబాబుకు ఎంత మెజారిటీ వస్తుంది?

ఆ పేరు చెబితే,ఆధిక్యం గురించే తప్ప గెలుపు గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోరు.ఇద్దరి చంద్రులు హోరాహోరీగానే తలపడ్డారు.కానీ,లెక్కలు మాత్రం మెజారిటీ చుట్టే తిరుగుతున్నాయి.వరుస విజయాలతో ఊపుమీదున్న అధినేతకు గత ఎన్నికల్లో కాసింత బలం తగ్గింది.ఈనేపథ్యంలో ఈసారి ఫలితం ఏవిధంగా ఉండబోతుందన్న చర్చ జోరుగా సాగుతోంది.

చిత్తూరు జిల్లాలో ఎవరి గెలుపోటములు ఎలా ఉన్నా,కుప్పంలో మాత్రం మెజారిటీపైనే లెక్కలు నడుస్తున్నాయి.ఏపీ సీఎం,టీడీపీ అధినేత పోటీ చేసిన స్థానం కావడంతో,కుప్పం ఎన్నిక ఉత్కంఠను రేపుతోంది గత ఎన్నికలతో పోలిస్తే చంద్రబాబుకు మెజారిటీ భారీగా పెరుగుతుందని టీడీపీ,తగ్గుతుందని వైసీపీ పోటీపడుతున్నాయి.2014 ఎన్నికల్లో చంద్రబాబుకు 47వేలకుపైగా మెజారిటీ లభించింది.2009లో 70 వేల ఓట్ల మెజారిటీ లభించింది.మెజారిటీ తగ్గిన అంశంపై కుప్పం పర్యటనకు వెళ్లిన ప్రతిసారి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సారి మెజారిటీ పెంచుకోవాలన్న లక్ష్యంతో చంద్రబాబు కుప్పంపై ప్రత్యేక దృష్టి సారించారు.చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సైతం కుప్పం నాయకులపై కాస్త అసహనం వ్యక్తం చేశారు కూడా.ఏది ఏమైనప్పటికీ,సంక్షేమ పథకాలకు తోడు,చంద్రబాబు ఇమేజ్‌తో కుప్పంలో బంపర్ మెజారిటీ వస్తుందంటున్నారు తమ్ముళ్లు.

కుప్పం నియోజకవర్గంలో 1962 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి.సీపీఐ,కాంగ్రెస్ ఒకసారి గెలవగా,మూడుసార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు.కుప్పం నియోజకవర్గం 1989 నుంచి టీడీపీకి కంచుకోటగా మారింది. 89నుంచి చంద్రబాబు నాయుడు వరుసగా గెలుస్తూ వస్తున్నారు.2009 ఎన్నికలతో పోలిస్తే 2014 ఎన్నికల్లో కాస్త మెజారిటీ తగ్గడంతో….2019 ఎన్నికల ఫలితాల్లో ప్రజల తీర్పు ఏవిధంగా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.2014లో చంద్రబాబు మెజార్టీ తగ్గించిన వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి, ఈసారి కూడా గట్టిపోటీనే ఇచ్చారని వైసీపీ భావిస్తోంది.ఇదిలా ఉంటే,గత ఎన్నికలతో పోలీస్తే ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగింది. పెరిగిన ఓటింగ్ ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్లేనని టీడీపీ అంటే,ప్రభుత్వ వ్యతిరేకత వల్లేనని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

కుప్పంలోఅసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2లక్షల 9వేల 147 ఓట్లున్నాయి.నియోజకవర్గంలో వన్నెకుల క్షత్రియ,కురబ,బలిజ, గాండ్ల సామాజిక వర్గాలు కీలకం.వీటిలో అందరికంటే వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి.వైసీపీ అభ్యర్థి తన సొంత సామాజిక వర్గం అయిన క్షత్రియుల ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నారు.గెలుపు కష్టమే అయినా కనీసం మెజార్టీ తగ్గిస్తే చాలన్నది వైసీపీ ఆలోచనగా కనిపిస్తోంది.తమ్ముళ్లు మాత్రం లక్షకు పైగా మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఎవరి లెక్కలు ఎలా ఉన్నా,మే23న వెలువడే ఫలితాలతో అసలు మెజారిటీ తేలనుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *