మంగళగిరే ఎందుకు ..?

మంగళగిరే ఎందుకు ..?

రోజురోజుకూ వేడెక్కుతోంది. ప్రజలను ఆకట్టుకోవడానికి పార్టీల నాయకులు నానాపాట్లు పడుతున్నారు. మరో రెండు రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో.. మరింత వాడి వేడి పెంచుతున్నారు. ఇలాంటి సమయంలో.. కీలకమైన ఇద్దరు అధినేతలు.. తమ ప్రచార పర్వానికి క్లయిమాక్స్ వేదికగా దేనిని ఎంచుకుంటున్నారు ? ఆ స్థానాన్ని ఎందుకు ప్లాన్ చేసుకున్నారు…?

ప్రచారానికి కొద్ది గంటలే సమయం ఉండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలను రిలీజ్ చేసిన నేతలిద్దరూ….ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.

ప్రచారంలో దూసుకుపోతున్న ఇద్దరు నేతలు….. ఒకే ఊరిని తమ ప్రచారానికి చివరి వేదికగా ఎంచుకుంటుండడం విశేషం. అదే గుంటూరు జిల్లాలోని మంగళగిరి.

మరే ఇతర నియోజకవర్గానికి రాని ప్రముఖ్యత మంగళగిరికి రావడానికి కారణం టీడీపీ అధినేత చంద్రబాబు కొడుకు లోకేష్ ఇక్కడ పోటీచేస్తుండడమే. గత ఎన్నికల్లో కేవలం 12 ఓట్ల మెజారిటీతో ప్రస్తుతమున్న వైసీపీ అభ్యర్థి ఆర్కే గెలిచారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో దిగిన లోకేశ్‌కు ప్రత్యర్థిగా నిలబడింది కూడా ఆర్కేనే. ఈ అయిదేళ్లలో పలు సమస్యల విషయంలో చంద్రబాబు ప్రభుత్వంపై ముప్పేట దాడి చేశారు ఆర్కే. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలనే ఆశలు పదిలం చేసుకోవాలని లోకేశ్‌ భావిస్తున్నారు. మరోవైపు టీడీపీ అధినేత కొడుకును ఓడించి పార్టీ సత్తా చూపించాలని జగన్ వ్యూహరచన చేస్తున్నారు. అందుకోసం ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదని తెలిసింది. అందుకే హాట్‌ సీట్‌గా మారిన మంగళగిరినే తమతమ ప్రచారానికి క్లైమాక్స్‌ పాయింట్‌గా పెట్టుకున్నారు చంద్రబాబు, జగన్.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గెలిచి తండ్రి పేరుతో పాటు పార్టీ పేరు లోకేశ్‌ నిలబెడతాడా లేదా చేతులేత్తేస్తారా….మరోవైపు లోకేశ్‌ను ఓడించి ఆర్కే పార్టీ అధిష్టానం దృష్టిలో స్ట్రాంగ్ పర్సనాలిటీగా మిగిలిపోతారా అనేది ఆసక్తికరంగా మారింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *