ఇద్దరు చంద్రులకు ఇబ్బందికరంగా ఫలితాలు

ఇద్దరు చంద్రులకు ఇబ్బందికరంగా ఫలితాలు

మొన్నటి ఎన్నికలు ఇద్దరు చంద్రులకు ఒకేసారి దెబ్బేశాయా….ఒకరు సీఎం కాబట్టి…ఏం కాదు… ఇంకొకరు మాజీ సీఎం… ఆయన రాజకీయ భవిష్యత్‌ ఎలా ఉండబోతోంది. కేంద్రంలో చక్రం తిప్పుదాం అనుకుంటే మూడే ఎంపీ సీట్లు వచ్చాయి. తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇద్దరు చంద్రుల వ్యూహం ఎలా ఉండబోతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ఇద్దరు చంద్రుళ్లకు ఒకేసారి షాకిచ్చారు తెలుగు ప్రజలు. ఆ ఇద్దరు నేతల మితిమీరిన ఆత్మవిశ్వాసానికి భారీ దెబ్బ తగిలిందని చెప్పాలి. నూటికి వెయ్యిశాతం తమ గెలుపు ఖాయమన్న చంద్రబాబు.. ఈ ఎన్నికల ఫలితాల్ని కలలో కూడా ఊహించి ఉండరు. ఓడిపోతే ఓడిపోవచ్చు కానీ.. మరీ ఇంత దారుణమైన ఓటమిని ఆయన ఎప్పుడూ ఊహించి ఉండరు. టీడీపీ చరిత్రలో ఇంత దారుణమైన ఓటమికి పాలనా వైఫల్యమే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

175 స్థానాలున్న ఏపీ అసెంబ్లీలో టీడీపీకి కేవలం 23 స్థానాలు మాత్రమే రావటం చూస్తే.. ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వం మీద ఎంతటి వ్యతిరేకత ఉందన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు. పలువురు మంత్రులు మట్టికరిచిపోయారు. ఇక ముగ్గురు ఎంపీలు మాత్రమే గెలిచారు. శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, గుంటూరు నుంచి గల్లా జయదేవ్‌, విజయవాడ నుంచి కేశినేని నాని గెలిచారు. అయితే టీడీపీ సర్కారు విధానాలు కాకుండా… వారికి ఉన్న సొంత ఇమేజ్‌తోనే విజయం సాధ్యమైందన్నది జగమెరిగిన సత్యం.

ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఫలితాల్ని చూసి షాక్‌ అయ్యారనే చెప్పాలి. సారు కారు పదహారు కేంద్రంలో సర్కారు అన్న నినాదం సక్సెస్‌ కాలేదు. తాను ఢిల్లీలో చక్రం తిప్పుతూ.. తెలంగాణలో కేటీఆర్‌కి పట్టం కట్టాలన్న ఆలోచనను తెలంగాణ ప్రజలు తిరస్కరించినట్లుగా చెప్పక తప్పదు. మొత్తం 17 స్థానాల్లో ఒక స్థానం తన మిత్రుడికి వదిలేసిన కేసీఆర్.. మిగిలిన 16 ఎంపీ స్థానాల్లో విజయం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేశారు.

ఎన్నికల ఫలితాలు చూస్తే.. 16 ఎంపీ స్థానాలకు కేవలం 9 స్థానాల్లో టీఆర్ ఎస్ విజయం సాధించింది. అన్నింటికి మించి కేసీఆర్‌ కుమార్తె.. నిజామాబాద్ ఎంపీ కవిత ఓడిపోవడం టీఆర్‌ఎస్‌ వర్గాల్ని షాక్‌కు గురిచేసింది. మరోవైపు- 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 11 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ సంఖ్య 12కు చేరుకుంది. మొత్తంగా చూస్తే ఈ ఫలితాలు ఇద్దరు చంద్రుళ్లకు ఇబ్బందికరంగానే ఉన్నాయి.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *