త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు

త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు

దేశ వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బీజేపీ… ఏపీలో కూడా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్రమంత్రులు ప్రకాశ్ జావదేకర్, కిషన్ రెడ్డి పలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. విపక్షాలపై తీవ్రంగా ధ్వజమెత్తి… రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ మార్పులు చూస్తారని అనటంతో రాజకీయంగా పలు చర్చలకు దారి తీస్తున్నాయి.

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి తెరలేపింది. ఇప్పటికే తెలంగాణకు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జాతీయ అధ్యక్షుడు తాజాగా ఆదివారం కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్, కిషన్‌ రెడ్డిలను ఏపీ కి పంపించారు. జవదేకర్ తిరుపతిలో, కిషన్ రెడ్డి విజయవాడలో కార్యక్రమానికి హాజరైన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు రానున్నాయని కేంద్రహోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజలు బీజేపీని విశ్వసిస్తున్నారని అన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని.. పోలవరానికి చివరి రూపాయి కూడా కేంద్రమే ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ కుటుంబ రాజకీయాలకు వ్యతిరేఖమని కిషన్ రెడ్డి అన్నారు.

మోదీని ప్రధాని బాధ్యతల తప్పిస్తానమన్న నేతలంతా సెలవులపై విదేశీ పర్యటనలు చేస్తున్నారని ప్రకాశ్‌ జావడేకర్‌ ఎద్దేవా చేశారు. బీజేపీని ఓడించి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతామన్న వారికి ప్రజలు ఓడించి గుణపాఠం చెప్పారంటూ తెదేపాను ఉద్దేశించి విమర్శలు ఎక్కుబెట్టారు. భాజపాతో పొత్తువల్లే 2014లో తెదేపా గెలిచిందని.. మోదీని దూషించడంతోనే తాజా ఎన్నికల్లో భారీ ఓటమిని చవిచూసిందని చురకలు అంటించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *