తూచ్చి... గవర్నర్ మారరు..

తూచ్చి... గవర్నర్ మారరు..

రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు రానున్నారనే వార్తలు ఇటు మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ షికారు చేస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్, లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఏపీ, తెలంగాణకు గవర్నర్లుగా రానున్నారనే వదంతులు కూడా వచ్చాయి. అక్కడక్కడా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ పేరు కూడా వినిపించింది. ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్పింహారావు ఈ వదంతులకు దాదాపుగా తెర దించేశారు. మంగళవారం సాయంత్రం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పట్లో గవర్నర్ నరసింహన్ ను మార్చేది లేదని స్పష్టం చేశారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నరసింహన్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఏకాంతంగా సమావేశమయ్యారు. అప్పుడే మరి కొంత కాలం గవర్నర్ గా కొనసాగాలని నరసింహన్ కు సూచనలు అందాయని చెబుతున్నారు. ప్రధాని మోదీ కూడా ఇందుకు సానుకూలంగానే ఉన్నారని అంటున్నారు.

ఆయనకే అన్నీ తెలుసు కాబట్టి!

ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాలలో సమస్యలు భారీగానే రావచ్చని కేంద్రం భావించింది. కానీ, నరసింహన్ అలాంటి పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తగా వ్యవహరించారని కేంద్ర పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం.. ఏపీలో వైఎస్ఆర్ సీపీ గద్దెను ఎక్కడం చకచకా జరిగిపోయాయి. ఈ రెండు ప్రభుత్వాలు కూడా సఖ్యతగా మెలగడం కూడా కేంద్రానికి నచ్చిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ను మారిస్తే సానుకూల వాతావరణానికి విఘాతం కలుగవచ్చని వారు భావిస్తున్నారని అంటున్నారు. అందుకే నరసింహన్ ను మరికొంత కాలం ఇక్కడే కొనసాగాలని ఆదేశించినట్టుగా సమాచారం. మరోవైపు గత ప్రభుత్వ నిర్వాకాల మీద జగన్ సర్కారు విచారణకు సిద్ధమవుతోంది. మోదీ, షాలకు చంద్రబాబు మీద ఇంకా కోపం తగ్గలేదని అంటున్నారు. గత ఐదేళ్లుగా ఏపీలో ఏం జరిగిందో నరసింహన్ కు పూర్తి అవగాహన కూడా ఉంది. గతంలో పలుసార్లు ఆయన కేంద్రానికి ఈ విషయం మీద నివేదికలు ఇచ్చారనే వార్తలు వచ్చాయి. ఈ అంశం కూడా నరసింహన్ పదవీకాలం పొడగింపునకు కారణం కావచ్చనే వాదనలూ వినిపిస్తున్నాయి. మొత్తానికి తెలుగు రాష్ట్రాలలో సమీప కాలంలో గవర్నర్ మార్పు ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *