అమ్మో కిమ్మో..! ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌

అమ్మో కిమ్మో..! ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో జరిపిన చర్చలు విఫలం అవడంతో అందుకు కారకులంటూ అయిదుగురు అధికారులకు మరణశిక్ష విధించాడని విని ప్రపంచం అవాక్కైంది. కానీ ఇలాంటి హత్యలూ ఇంతకు మించిన దారుణాలూ ఉత్తర కొరియాలో ఎన్నో జరిగాయి, జరుగుతున్నాయి.మనకు స్వాతంత్య్రం వచ్చాక ఏడాదికి ఉత్తర కొరియాకి స్వతంత్రం వచ్చింది. కానీ ఆ తర్వాతే అక్కడి ప్రజల స్వేచ్ఛ హరించుకుపోయింది. గత డెబ్భై ఏళ్లుగా వారికి మరో ప్రపంచం తెలియదు. తెలియకుండా చేశారు వాళ్ల అధ్యక్షులు. ఉత్తర కొరియా మొదటి అధ్యక్షుడు కిమ్‌ ఇల్‌ సంగ్‌ అధికారంలోకి రాగానే ఆ దేశంతో ప్రపంచానికి ఉన్న వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసేశాడు. అప్పట్నుంచీ బయట ఏం జరుగుతుందో కూడా వారికి తెలియని పరిస్థితి. అధ్యక్షుడే వారికి దైవం. మరో దైవాన్ని పూజించినా ఒప్పుకోరు. తినడానికీ బట్టకట్టడానికీ జుట్టు కత్తిరించడానికీ అన్నిటికీ ప్రభుత్వ నిబంధనలే. పాటించకపోతే కఠిన శిక్షలే. పోనీ దేశం విడిచి వెళ్లి ఎక్కడైనా బతుకుదామంటే పోనివ్వరు. అందుకే, మిగిలిన ప్రపంచంతో పోల్చితే తామెంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నామన్న విషయం కూడా అక్కడి జనానికి తెలీదు. ఇంటర్నెట్‌ వచ్చిన ఈరోజుల్లో ఏమూల ఏం జరుగుతున్నా తెలుస్తుందిగా అనుకోవచ్చు. కానీ వారికి ఇంటర్నెట్‌ ఉండదు. ఈమధ్యే ఫోన్‌ సదుపాయం వచ్చింది కానీ లోకల్‌కాల్స్‌ మాత్రమే మాట్లాడాలి. టీవీల్లో ప్రభుత్వానికి చెందిన మూడు ఛానెళ్లే వస్తాయి.

కిమ్‌ జాంగ్‌ ఉన్‌… ఉత్తర కొరియా ప్రస్తుత అధ్యక్షుడు. 1948లో అవతరించిన ఆ దేశానికి మొదటి అధ్యక్షుడు ఇతడి తాత కిమ్‌ ఇల్‌ సంగ్‌ అయితే, రెండో అధ్యక్షుడు కిమ్‌ ఉన్‌ తండ్రి కిమ్‌ జాంగ్‌ ఇల్‌. తండ్రి మరణం తర్వాత 2011లో వారసత్వంగా అధికారంలోకి వచ్చాడు కిమ్‌ ఉన్‌. ఆశ్చర్యం ఏంటంటే క్రూరత్వం, నియంతృత్వంలో ఈ ముగ్గురూ ఒకరిని మించిన వాళ్లు మరొకరు. అధికారం చేపట్టేనాటికి కిమ్‌ ఉన్‌ వయసు 27 ఏళ్లు. వయసులో చిన్నే కానీ హింసా ప్రవృత్తిలో ఇతడిని మించిన వారుండరేమో. ఎంతగా అంటే తన తండ్రి మరణించినందుకు ఆ దేశ ప్రజలందరూ తీవ్రంగా బాధపడాలని ఆదేశించాడు. సైనికుల్ని నియమించి కన్నీళ్లు కార్చని వారినీ తండ్రి సంతాప కార్యక్రమాలకు హాజరుకాని ప్రజలనూ బంధించి ఆరునెలల జైలు శిక్ష వేశాడు. వారిని లేబర్‌ క్యాంపులకి పంపించి చిత్ర హింసలకు గురిచేశాడు. కిమ్‌ ఉన్‌ తండ్రి కూడా అతడి తండ్రి చనిపోయినపుడు బాధపడని వారిని ఇలానే శిక్షించాడట.

కిమ్‌ ఉన్‌ అధికార పర్వమే పదుల సంఖ్యలో ఉన్నతాధికారుల హత్యలతో మొదలైంది. తన అధికారానికి ఎవరైనా అడ్డుతగులుతారనే ఊహ వచ్చినా వారిని నిర్దాక్షిణ్యంగా చంపించేస్తాడు. రెండేళ్ల కిందట సవతి సోదరుడు కిమ్‌ జాంగ్‌ నామ్‌ను కూడా విష ప్రయోగంతో చంపించాడు. ప్రభుత్వ నిబంధనల్ని పాటించని వారిని బహిరంగంగా అందరూ చూస్తుండగా కాల్చి చంపడం కిమ్‌ జాంగ్‌ ఉన్‌కి ఓ సరదా.కాగా అణు పరీక్షలు చెయ్యడం కిమ్‌కి నిరంతర వ్యాపకం. అణు బాంబులూ క్షిపణులను తయారుచేసి శత్రు దేశాలను భయపెట్టడంతోపాటు, అదే తమ దేశ అభివృద్ధికి చిహ్నంగా చెబుతుంటాడు.

ఏదేమైనా ఉత్తర కొరియాలో నియంతపాలన సాగుతోంది. అక్కడి ప్రజలను కిమ్ పీల్చి పిప్పిచేస్తున్నారు. కిమ్ దౌర్జన్యాలు ఎప్పటికి ఆగుతాయో ఎవరికీ తెలియడం లేదు. అక్కడి ప్రజలను చూసి బాధపడడం తప్ప ఎవరూ ఏం చేయగలిగింది లేదు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *