బ్రోచేవారెవరురా! ట్విటర్ టాక్

బ్రోచేవారెవరురా! ట్విటర్ టాక్

కథను ఎంచుకోవడంలో తనదైన ప్రత్యేక శైలిని చూపిస్తున్న నటుడు శ్రీవిష్ణు మరో సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. స్నేహితుడు నారా రోహిత్ ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రీవిష్ణు మంచి కథాంశం ఉన్న పాత్రలనే ఎంచుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించాడు. ఏడాది క్రితం ‘నీది నాది ఒకే కథ, వీర భోగ వసంత రాయలూ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ఈ ఏడాది విభిన్నమైన చిత్రంతో మళ్లీ థియేటర్ల ముందు హడావుడి చేయడానికి వచ్చేశాడు.

శ్రీవిష్ణు, నివేదా థామస్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, సత్యదేవ్, నివేతా పెతురాజ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ‘చలనమే చిత్రము – చిత్రమే చలనము’ ఉప శీర్షిక. ‘మెంటల్ మదిలో’ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకుడు. వివేక్ సాగర్ సంగీతాన్ని అందించారు. సినిమా టైటిల్‌ నుంచే ప్రత్యేకతను సంతరించుకున్న ఈ సినిమా పోస్టర్‌తో కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. పబ్లిషిటీలోనూ ఎక్కడా వెనకడుగు వేయకుండా సినిమాను బాగానే ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లారు. ప్రచార పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెంచారు. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్‌లో తొలి ప్రీమియర్ షో చూసిన ప్రేక్షకులు…ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను చెప్పేస్తున్నారు. సినిమా చాలా బాగుందని కితాబిచ్చేశారు.

సినిమా తొలి సన్నివేశం నుంచే వినోదాన్ని పంచుతోందని చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ అద్భుతంగా చేశారని.. తమ కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించారని అంటున్నారు. కథనం కాస్త నెమ్మదిగా ఉన్నా మొత్తంగా సినిమా బాగుందని టాక్ చెప్పేస్తున్నారు. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని, మిస్ అవొద్దని సలహా ఇస్తున్నారు. మొత్తంమీద ‘బ్రోచేవారెవరురా’ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తొలిరోజే ఇలాంటి టాక్ రావడంతో శ్రీవిష్ణు హిట్టుకొట్టినట్టే అని సోషల్ మీడియాలో కామెంట్లు చేసేస్తున్నారు!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *