కమల వికాసం అదృష్టమేనా...!

కమల వికాసం అదృష్టమేనా...!

ఎవ్వరూ ఊహించనిరీతిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలను సాధించుకుంది. కేంద్రంలో అఖండ విజయం సాధించిన తరుణంలో తాము భారీగా ఆశలు పెట్టుకున్న తెలంగాణలో ఇలాంటి ఫలితాలు రావడంతో ఆ పార్టీ నాయకుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. అయితే, తెరాసకి అసలైన ప్రత్యామ్నాయం తామేననీ, బీజేపీ గెలుపు కేవలం గాలివాటమేననీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి సంతోషం మీద నీళ్లు చల్లే ప్రయత్నం చేశారు. ఈసారి కాంగ్రెస్ మూడు స్థానాలలో గెలుపొందింది. ఇది పెద్దగా ఆశ్చర్యం కలిగించపోయినా, తెరాసకు వెన్నుదన్నుగా ఉండే ఉత్తర తెలంగాణలోనే మూడు సీట్లనూ కైవసం చేసుకోవడం సంచలనంగా మారింది. అయితే నాలుగు సీట్లలోనూ కమలనాథుల గెలుపునకు వేర్వేరు కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇవే కారణాలా???

కరీంనగర్ నుంచి విజయం సాధించిన బండి సంజయ్ అంతకు ముందు అక్కడి నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.దీంతో ఆయన మీద సానుభూతి పవనాలు వీచాయని అంటున్నారు. అదీగాక ఆయనకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండడమూ, ఏబీవీపీలో పని చేసి బీజేపీలో కీలక నేతగా ఎదగడమూ కలిసి వచ్చిందని అంటున్నారు. దీనికి తోడు తాను స్థానికుడు కావడం, టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ స్థానికేతరుడు కావడం, ఆ పార్టీ పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకత సంజయ్ గెలుపునకు బాటలు వేశాయని అంటున్నారు. అలాగే నిజామాబాద్లో కవితను ఓడించడానికి తెర వెనుక భారీ ప్రయత్నాలు జరిగాయని, చివరి క్షణంలో కాంగ్రెస్ బీజేపీకి సహకరించిందని దీంతో అరవింద్ సునాయసంగా విజయం సాధించారని అంటున్నారు. టీఆర్ఎస్ మీద ఉన్న అసంతృప్తిని ఓట్ల రూపంలోకి బీజేపీ మార్చుకోగలిగిందని చెబుతున్నారు.

ఆదిలాబాద్లో ఆదివాసీ నేత సోయం బాపూరావు అనూహ్య విజయం వెనుక కూడా స్థానిక కారణాలే ఉన్నాయంటున్నారు. అక్కడ ఆదివాసీలకూ, లంబాడాలకూ మధ్య వివాదం కొనసాగుతోంది. లంబాడాలు మహారాష్ట్రలో బీసీలుగా కొనసాగుతున్నారు. ఇక్కడ మాత్రం వారిని ఎస్టీలుగా గుర్తిస్తున్నారు. దీంతో మహారాష్ట్ర నుంచి చాలా మంది లంబాడాలు చాలా ఏళ్ల క్రితమే ఇక్కడికి వలస వచ్చారు, వారంతా ఎస్టీలు మారి తమ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్నారని ఆదివాసీలు ఆందోళనకు దిగారు. ఈ సమస్యకు తగిన పరిష్కారాన్ని కనుగొనడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, దీంతో ఆదివాసీలు అంతా ఏకమై తమ నేత సోయం బాపూరావును గెలిపించుకున్నారని చెబుతున్నారు. సికింద్రాబాద్ బీజేపీకి సిట్టింగ్ స్థానమే. ఇక్కడి నుంచి ఎంపీగాపోటీ చేసిన కిషన్ రెడ్డీ అంతకు ముందు అంబర్ పేటలో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. దీంతో ఇక్కడా సానుభూతి పవనాలు వీచాయి.

తలసాని శ్రీనివాస్కు మంత్రి పదవి ఇవ్వడం మీదనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఆయన కొడుకు సాయికిరణ్కూ టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వడంపై పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి వ్యక్తం అయిందనీ, జనం కూడా ఆమోదించలేకపోయారనీ అంటున్నారు. ఇటు కిషన్ రెడ్డి గెలిస్తే కేంద్రంలో మంత్రి అవుతారనే వార్తలు వచ్చాయి. ఇవన్నీ కలిసి బీజేపీ విజయానికి దోహదం చేశాయని అంటున్నారు. ఈ రకంగా నాలుగు విభిన్న కారణాలతో బీజేపీ నాలుగు సీట్లను సాధించుకోగలిగిందని
పరిశీలకులు చెబుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *