తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్‌

తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్‌

రెండోసారి పవర్‌లోకి వచ్చిన బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో బలపడేందుకు ఫోకస్ పెట్టింది. తెలంగాణలో 2023 నాటికి అధికారపక్షంగా అవతరించాలని డిసైడ్ అయిన బీజేపీ.. అందుకు తగ్గట్లే వ్యవహరిస్తోంది. ఇదే విషయాన్ని ఈ మధ్యన బీజేపీ ముఖ్యనేతలు తరచూ వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ తదుపరి లక్ష్యమని అమిత్ షా చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ అధికారాన్ని చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నాలుగు స్థానాల్లో గెలుపొందింది. ఈనేపథ్యంలో పార్టీని మరింతగా బలపర్చేందుకు వేగం పెంచారు.

అమిత్ షా కిషన్‌ రెడ్డికి కొన్ని కీలక పనులు అప్పగించినట్లు చెబుతున్నారు. తెలుగు రాష్ట్ర రాజకీయాలపై కిషన్‌రెడ్డికి స్పష్టమైన అవగాహన ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించిన కిషన్ రెడ్డికి, అన్ని పార్టీల నేతలతో పరిచయాలున్నాయి. వివాదాల్లో చిక్కుకోకుండా ఉండటం ఎలానో ఆయనకు బాగా తెలుసు. అందుకే కిషన్ రెడ్డికి అమిత్ షా ఏపీ-తెలంగాణకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ పని అప్పగించారట. ముందస్తులో పరాజయం పలకరించడంతో, సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు కిషన్ రెడ్డి. మోదీ కేబినెట్‌లో హోంమంత్రి అమిత్ షా శాఖకు సహాయమంత్రిగా కొనసాగుతున్నారు. రెండు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి ఒక్కరే కేంద్రమంత్రిగా ఉండడం విశేషం.

కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఎప్పటికప్పుడు ఢిల్లీ పెద్దలకు చేరవేసే అవకాశముంది. ఇప్పటికే ఆయన గ్రౌండ్ రిపోర్ట్‌ రెడీ చేసినట్లు చెబుతున్నారు. వలస నేతలతో పాటు, ఆయా ప్రాంతాల్లో పార్టీకి అవసరమైన నాయకత్వంపై దృష్టిసారించినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఇప్పటికే కేంద్ర పెద్దల ఆదేశాలతో కమలనాథులు రెండు రాష్ట్రాల్లో దూకుడు పెంచారు. ఏపీలో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్‌ టార్గెట్‌గా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. రాష్ట్రంలో రాజకీయపరమైన యుద్ధానికి సిద్ధం కావాలని తెలంగాణ బీజేపీ చీఫ్‌ లక్ష్మణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

తెలుగు రాష్ట్రాల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా సాగుతున్న కమలనాథులు, ఏమేరకు సక్సెస్ అవుతారన్నది చూడాలి మరి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *