బీజేపీ ప్రధాని కొత్తవారేనా?

బీజేపీ ప్రధాని కొత్తవారేనా?

లోక్‌సభకు ఐదో దశ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో దేశంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితాల అనంతరం అవసరమైతే ప్రధాని అభ్యర్థిని మార్చేందుకు అయినా సిద్ధంగా ఉండాలంటూ బీజేపీ మిత్రపక్షం శివసేన ఒత్తిడి తెస్తోందని అంటున్నారు. ఇందుకోసం తెర వెనుక భారీ ప్రయత్నాలే జరుగుతున్నాయని తెలుస్తోంది. లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీ రాక, ఏకైక అతి పెద్ద పార్టీగా నిలిస్తే మాత్రం ఈ ప్రతిపాదనను మిత్రపక్షాలన్నీ కలిసి బీజేపీ ముందు పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

కొట్టిపడేస్తున్నారు…

తృతీయ ఫ్రంట్ ప్రయత్నాలు ఊపందుకుంటున్న వేళ ఈ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోవడం వెనుక భారీ వ్యూహాలే ఉన్నాయని అంటున్నారు. బీజేపీ నుంచి అధికారం దూరం కాకుండా ఉండడానికి అవసరమైతే మోడీని ప్రధాని పదవికి దూరంగా ఉంచాలని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇలాంటి కొత్త ప్రతిపాదనలు ముందుకు వస్తున్నాయని చెబుతున్నారు. పార్టీలోని మోడీ అభిమానులు మాత్రం ఈ వార్తలను కొట్టి పడేస్తున్నారు. బీజేపీ పూర్తి మెజారిటీతోనైనా, మిత్రపక్షాల సహకారంతో అయినా అధికారంలోకి వచ్చి తీరుతుందనీ, మోడీ ప్రధాని అయి తీరతాడని వారు చెబుతున్నారు.

అమిత్‌షాకూ కీలక పదవి…
పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కూడా కీలక పదవిలో ఉంటారనేది వారి అభిప్రాయంగా ఉంది. అయితే మోడీని గద్దెకు దూరం చేయడానికి పార్టీలోని ఓ వర్గం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిందని సమాచారం. నితిన్ గడ్కరీ, సుష్మా స్వరాజ్ లాంటి రెండు, మూడు పేర్లను వారు ముందుకు తెస్తున్నారని సమాచారం. అయితే ఉత్తర భారతదేశంలో ఇటీవల కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుందనీ, బీజేపీని వెనుక్కు నెట్టి కాంగ్రెస్సే అతి పెద్ద పార్టీగా నిలిచినా ఆశ్చర్యపోనక్కర లేదని ఇంకొందరు చెబుతున్నారు. మోడీని మార్చని పక్షంలో బీజేపీ మిత్రపక్షాలు కొన్ని కాంగ్రెస్ వెంట నడిచే అవకాశాలూ ఉన్నాయని చెబుతున్నారు. తృతీయ ఫ్రంట్ అనుకూలంగా లేకపోతే కేసీఆర్, మమత, నవీన్ పట్నాయక్ లాంటి వారు అనివార్యంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే అవకాశాన్నీ కొట్టి పారవేయలేమని పరిశీలకలు అభిప్రాయపడుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *