సీనియర్లు వద్దు... యువతే ముద్దు..!! కమలం కొత్త వ్యూహం

సీనియర్లు వద్దు... యువతే ముద్దు..!! కమలం కొత్త వ్యూహం

తెలుగు రాష్ట్రాలలో బలపడేందుకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం కొత్త వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వివిధ పార్టీలలో ఉన్న సీనియర్ నాయకులను కాకుండా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపైనా, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలపైనా కన్నేసిన కమలనాథులు ఆ పార్టీలోని యువ నాయకత్వాన్ని తమ వైపు తిప్పుకోవాలని రెండు రాష్ట్రాల బీజేపీ నాయకులను ఆదేశించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పదవులివ్వడమెందుకని…

రెండు రాష్ట్రాల్లోని యువజన విభాగంలో ఉన్న నాయకులను భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షించేలా చేసి పార్టీలో వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నది భారతీయ జనతా పార్టీ అధిష్టానం వ్యూహంగా చెబుతున్నారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది తమ ప్రయత్నాలు చేస్తున్నా… అధిష్టానం మాత్రం వారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదని సమాచారం. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులను పార్టీలో చేర్చుకుంటే వారికి పదవులు ఇవ్వాల్సి వస్తుందని, అదే యువతను చేర్చుకుంటే పదవుల పందారం చేసేందుకు ఇప్పట్లో అవకాశాలు ఉండవనేది పార్టీ అధిష్టానం యోచనగా చెబుతున్నారు.

ప్రత్యేకహోదా దృష్టి మార్చాలంటే..!

అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ, జనసేన నుంచి కూడా యువకులను చేర్చుకుంటే వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. యువ నాయకత్వాన్ని పార్టీలో చేర్చుకోవడం, వారికి పార్టీ పదవులు ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పట్ల ఆగ్రహంగా ఉన్న యువతీ, యువకులను కాస్త శాంతింప చేయవచ్చునన్నది బీజేపీ అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు. బీజేపీలో చేరిన యువత ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలని బీజేపీ భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఎదగడానికి ప్రత్యేక హోదా అడ్డంకిగా ఉందని, ఈ విషయం నుంచి దృష్టి మరల్చాలంటే యువకులను పార్టీలో చేర్చుకుని వారికి పార్టీ పదవులు కట్టబెట్టాలన్నది బీజేపీ లక్ష్యంగా కనబడుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వివిధ పార్టీలలో అసమ్మతిగా ఉన్న సీనియర్లను ఆకర్షిస్తూనే ప్రధాన దృష్టి మాత్రం యువతపైనే పెట్టాలన్నది భారతీయ జనతా పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. తెలంగాణ పర్యటనకు వచ్చిన పార్టీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తెలంగాణ నాయకులకు ఇదే విషయాన్ని చెప్పారని, తనను కలిసేందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకులతో కూడా యువతను ఆకర్షించాల్సిందిగా దిశానిర్దేశం చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *