ఏపీలో ఆపరేషన్ కమలం !

ఏపీలో ఆపరేషన్ కమలం !

ఫలితాల అనంతరం ఏపీలో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఏపీ చేపట్టినట్టుగా తెలుస్తోంది. కేశినేని కేంద్రంగా టీడీపీలో ప్రకంపనలు మొదలయినట్టుగా కనిపిస్తున్నాయి. ఏపీకి హోదా ఇవ్వడం, టీడీపీని దెబ్బతీయడం, బీజేపీని బలపర్చడం లక్ష్యంగా కమలదళం పావులు కదుపుతోందట. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చంద్రబాబు హోదా విషయంలో బీజేపీని టార్గెట్ చేయం వల్లే, ఎన్నికల్లో తాము ఓడిపోయామని ఓ ఇంటర్వ్యూలో రాంమాధవ్ అన్నారు. అవసరమైతే ప్రత్యేకహోదాపై మోదీతో చర్చించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని హాట్ కామెంట్స్ చేశారు. తెలుగు వ్యక్తి అయిన రాంమాధవ్ బీజేపీలో కీలక నేత. ఈశాన్య రాష్ట్రాల ఇంఛార్జ్‌గా అక్కడ బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. పలు హిందీ రాష్ట్రాల్లో కూడా బీజేపీ గెలుపునకు దోహదపడ్డారు.

సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ఓటమి లక్ష్యంగా చంద్రబాబు ప్రణాళికలు రచించారు. విపక్షాల కూటమిని ఏకం చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. కానీ, చివరకు అంచనాలన్నీ తలకిందులయ్యాయి. కేంద్రంలో బీజేపీ ఘనవిజయం సాధించగా..ఇక ఏపీలో టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. రెండోసారి అధికారం చేపట్టిన మోదీ సర్కార్….ఏపీలో టీడీపీ టార్గెట్‌గా పని మొదలుపెట్టిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని నానితో ఈ గేమ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. నానిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా, టీడీపీ నుంచి మరికొందరిని తమవైపు తిప్పుకోవాలని కమలనాథులు భావిస్తున్నారట. 2024 ఎన్నికల నాటికి ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ భావిస్తోందట.

ఇదిలా ఉంటే, టీడీపీలో అంతర్గత పోరు మరింత ముదిరినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే విప్ పదవిని తిరస్కరించి దుమారం రేపిన విజయవాడ ఎంపీ కేశినేని…సోషల్ మీడియాలో మరో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్ళు తప్ప అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అయింది. చంద్రబాబుతో సమావేశం అనంతరం తాను పార్టీలోనే ఉంటానని నాని తెలిపారు. తనకు ఏ పదవీ వద్దని చంద్రబాబుకు చెప్పినట్టు సమాచారం. ఇదిలా ఉండగానే, కేశినేని మరో పోస్ట్ చేయడం టీడీపీలో కలకలం రేపుతోంది. ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎంపిక, నిర్వహణ బాధ్యతలను కేశినేని నానికి అప్పగించారు పార్టీ పెద్దలు. నాని కూడా ఆ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఐతే, సడన్‌గా దేవినేని ఎంట్రీతో నాని అలకబూనారాట. మొదట తనకు బాధ్యత అప్పగించి మళ్లీ దేవినేనికి పగ్గాలు ఇవ్వడంపై నాని మనస్తాపానికి గురయ్యారట.

మొత్తంగా, బీజేపీలో చేరుతున్నట్టుగా వస్తున్న వార్తల్ని నాని ఖండిస్తున్నా…ఆ పార్టీలో చేరడం ఖాయమైందన్న టాక్ వినిపిస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *