తెలంగాణ బీజేపీకి కొత్త బాస్‌..?

తెలంగాణ బీజేపీకి కొత్త బాస్‌..?

తెలంగాణ టార్గెట్‌గా బీజేపీ వ్యూహాలు ఊపందుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా సాగుతున్న కమలనాథులు, తాజాగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. లక్ష్మణ్‌ను పార్టీ మార్చడానికి అమిత్ షా రెడీ అయ్యారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మొన్న తెలంగాణలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వచ్చిన అమిత్ షా…పార్టీ నేతలకు క్లాస్ పీకారట. 20 లక్షల సభ్యత్వం టార్గెట్ పెట్టగా 10 లక్షలే చేయడంపై సీరియస్ అయ్యారట. దీనికి తోడు, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మణ్ సారథ్యంలో, ఒంటరిగా ఎన్నికలకు వెళ్లిన బీజేపీ ఘోరంగా విఫలమైంది. ఆ ఎన్నికల్లో ఉన్న స్థానాలను పోగొట్టుకొని, కేవలం ఒకే అసెంబ్లీ స్థానానికి పరిమితమైంది. రాజాసింగ్ మినహా అందరూ ఓడిపోయారు. ఈనేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని తీసుకొచ్చి దూకుడుగా ముందుకు వెళ్లాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట.

తెలంగాణ కొత్త బీజేపీ అధ్యక్షుడి రేసులో ప్రధానంగా నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. అందులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మురళీధర్ రావు – ఎమ్మెల్సీ రాంచంద్రరావు – నిజామాబాద్ ఎంపీ అరవింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ల పేర్లు అధ్యక్షుడి రేసులో ముందున్నాయి. బీసీ అయిన అరవింద్ వైపు అధిష్ఠానం మొగ్గుచూపుతున్నట్టుగా తెలుస్తోంది. నిజామాబాద్‌లో కవితపై అరవింద్ గెలుపు బీజేపీ పెద్దలను ఆకర్షించిందట. అరవింద్ దూకుడు – వ్యవహారశైలి నచ్చడంతో ఆయనకే పదవి ఇస్తారన్న చర్చ సాగుతోంది. అయితే రాజకీయాలకు పూర్తిగా కొత్త కావడం మైనస్ అంటున్నారు.

లక్ష్మణ్ బీసీ కావడంతో ఆయన స్థానంలో మరో బీసీని నియమిస్తేనే పార్టీలో సామరస్య పూర్వక వాతావరణం ఉంటుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. జాతీయ స్థాయిలో కీలకంగా ఉన్న మురళీ ధర్ రావును ఒక రాష్ట్రానికి అధ్యక్షుడిని చేయడం మంచిదికాదన్న అభిప్రాయానికి అమిత్ షా వచ్చారట. ఇక అగ్రవర్ణం కోటా రాంచంద్రరావుకు మైనస్‌గా మారిందంటున్నారు. అదే సమయంలో బండి సంజయ్ పేరును పరిశీలిస్తున్నారట. ఇప్పటికే కిషన్‌ రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నారు. అమిత్ షా ఆయనకు కొన్ని కీలక పనులు అప్పగించినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటే గెలుచుకోవడంతో, రాష్ట్రంపై ఆ పార్టీ ఆశలు వదిలేసుకుందట. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని విధంగా నాలుగు ఎంపీ సీట్లను గెలవడం బీజేపీ అధిష్టానాన్ని ఆశ్చర్యానికి గురిచేసిందట. దీనికి తోడు రెండోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావడంతో, తెలంగాణలో పార్టీకి స్కోప్ ఉందని భావించి గేర్ మార్చారట. ఇందుకోసం బీజేపీ యాక్షన్ ప్లాన్ ను కూడా రెడీ చేసిందట. షార్ట్ కట్‌లో పార్టీ పుంజుకునేలా, ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిందన్న టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్-టీడీపీతో పాటు టీఆర్ఎస్‌ నుంచి నేతలు బీజేపీలోకి క్యూ కట్టనున్నారని రూమర్లు వస్తున్నాయి.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *