జనసేనకు కమలం భారీ ఆఫర్

జనసేనకు కమలం భారీ ఆఫర్

ఎలాగైనా బలపడాలి…? ఎలాగైనా అధికారంలోకి రావాలి…? ఎలాగైనా దక్షిణాది రాష్ట్రాలలో బలం పుంజుకోవాలి…? ఇప్పటికే కర్ణాటకలో రాజకీయం రసకందాయంలో పడటం, తెలుగు రాష్ట్రాలలో పార్టీ బలపడతూండటంతో భారతీయ జనతా పార్టీ ఎలాంటి వ్యూహాలైనా అమలు చేసేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా జనసేన పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసేందుకు పార్టీ అధిష్టానం తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

అబ్బే..అసలు కలుసుకోనేలేదు!

అమెరికాలో జరిగిన తానా సభలలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కలవడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఈ సమావేశంపై ఇద్దరు నాయకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అసలు తాము సమావేశం కాలేదంటూ ఇద్దరు నాయకులు ప్రకటించారు. కాని వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు భారతీయ జనతా పార్టీ మెగా ఆఫర్ ఇచ్చినట్లుగా భారతీయ జనతా పార్టీలో ప్రచారం జరుగుతోంది. పవన్ కల్యాణ్ తో పాటు ఆయన సోదరుడు చిరంజీవిని కూడా భారతీయ జనతా పార్టీలోకి తీసుకువస్తే మెగా కుటుంబానికి రెండు పెద్ద పదవులు ఇస్తామని బీజేపీ పెద్దలు ఎర వేసినట్లుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. మెగా కుటుంబంలో చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వంతో పాటు కేంద్ర మంత్రివర్గంలో కూడా స్థానం కల్పిస్తామని బీజేపీ నాయకులు తాయిలం విసిరినట్లు చెబుతున్నారు.

ఎవరికి చెబితే వారికి…

జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుడిగా పవన్ కల్యాణ్ కు అవకాశం ఇస్తామని కూడా బీజేపీ ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. మెగా కుటుంబంలో ఇద్దరికీ పదవులు ఇస్తామని, లేదూ అంటే పవన్ కల్యాణ్ సూచించిన వారికైనా పదవి ఇస్తామని చెప్పినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే పార్టీని విలీనం చేసే అంశంలో మాత్రం పవన్ కల్యాణ్ అంత సుముఖంగా లేరని, ఒకసారి విలీనమైతే ఇక భారతీయ జనతా పార్టీ చట్రంలో ఇరుక్కున్నట్లుగా అవుతుందని జనసేన పార్టీ ముఖ్య నాయకులు పవన్ కల్యాణ్ కు సూచించినట్లు చెబుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *