ప్రధానిగా తెలుగు నేత...!!?

ప్రధానిగా తెలుగు నేత...!!?

ప్రధానమంత్రిగా ఈసారి తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకుడికి అవకాశం ఉందా…? గతంలో ఒకసారి దేశ ప్రధానిగా చేసిన తెలుగు వారికి చాలా కాలం తర్వాత మరోసారి ఆ ఛాన్స్ రానుందా…? అవును… వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి పరిపూర్ణమైన మెజారిటీ రాకపోతే మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ అదే జరిగితే మిత్రపక్షాలు తిరిగి నరేంద్ర మోడీని ప్రధానిగా అంగీకరించే అవకాశం లేదంటున్నారు. తిరిగి అధికారంలోకి రావడం, హిందూ రాజ్యస్థాపనే ముఖ్యం అనుకుంటున్న రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ మిత్రపక్షాల డిమాండ్‌ను అంగీకరించే అవకాశం ఉందని చెబుతున్నారు. కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ రాకపోతే… మిత్రపక్షాలతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తే మాత్రం ఆర్ఎస్ఎస్ నుంచి ప్రధానమంత్రి పదవికి వచ్చే ప్రతిపాదనలో తెలుగు వాడి పేరు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ పేరే భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న రామ్ మాధవ్ అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన రాంమాధవ్ మధ్య  వయస్కుడు.  ఆయనకున్న పెద్ద అర్హత ఆవివాహితుడు కావడం. గడచిన 30 సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయంసేవక్‌లో వివిధ విభాగాలకు పనిచేసిన రామ్ మాధవ్‌కు అటు బీజేపీలోను, ఇటు ఆర్ఎస్ఎస్‌లోనూ మంచి సంబంధాలున్నాయి. వీటికి తోడు దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు రామ్ మాధవ్ ఎంపిక ఉపయోగపడుతుందని బిజెపి, ఆర్ఎస్ఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కంటే రాంమాధవ్ అయితే బాగుంటుందనేది ఆర్ఎస్ఎస్ వర్గాల ఆలోచనగా చెబుతున్నారు. ఈ సమీకరణాలతో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా తెలుగు వాడైన రాంమాధవ్ పేరు చర్చలోకి వస్తోంది.

ప్రత్యామ్నాయం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే అప్పుడు ప్రధానిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేరు గట్టిగా వినిపిస్తోంది. గతంలోనూ బాబు ప్రధాని అయ్యేందుకు అవకాశాలు వచ్చాయి. ఆ అవకాశాలను ఆయన సున్నితంగా తిరస్కరించారు. తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ప్రధాని రేసులో తాను లేనని ఇటీవల ప్రకటించారు. ఇప్పటికీ ఆయన అదే మాట మీద ఉన్నారంటున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు ప్రధాని పదవిని అంగీకరించే అవకాశం ఉందని చెబుతున్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రై కేంద్రంలో మరొకరు ప్రధానమంత్రి అయితే తనకు చిక్కులు తీసుకు వస్తారనే భయం చంద్రబాబును వెంటాడుతోందంటున్నారు. గతంలో ఉన్న పాత కేసులను తిరగతోడతారనే ఆందోళన చంద్రబాబు నాయుడులో కనపడుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలా జరగకుండా ఉండాలంటే తానే ప్రధానమంత్రిగా అంగీకరిస్తే ఇక ఎలాంటి చిక్కులు ఉండవనేది చంద్రబాబునాయుడు ఆలోచనగా చెబుతున్నారు. అదే జరిగితే తన ఆదేశాలను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి తప్పక పాటించాల్సిన అవసరం ఏర్పడుతుందనీ, ఇది ఆయనపై తన విజయంగా భావించవచ్చుననీ చంద్రబాబు నాయుడు తన సన్నిహితుల వద్ద అన్నట్లుగా సమాచారం. ఇదే జరిగితే మరోసారి దేశ ప్రధానమంత్రిగా తెలుగువాడు ఆ పీఠంపై కూర్చునే అవకాశం వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *