కారును కలవరపెట్టిన కమలం, హస్తం

కారును కలవరపెట్టిన కమలం, హస్తం

ఎన్నికల్లో ఎదురుగాలి వీస్తే ఎంతటి గొప్పనాయకులైనా ఓటమి చవిచూడక తప్పదు. అయితే ఆ ఓటమి నుంచి తేరుకొని మళ్లీ విజయం సాధించడం ప్రజల్లో వారికున్న పట్టుకు నిదర్శనం. దీనికి తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలే ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రముఖ నేతలు.. మళ్లీ కొద్ది కాలంలోనే పుంజుకుని ఎంపీ అభ్యర్థులుగా పోటీచేసి గెలుపొందడం విశేషం.

కొడంగల్‌ ఎమ్మెల్యేగా ఫైర్‌బ్రాండ్‌ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు రేవంత్‌ రెడ్డి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఆయన ఓటమి చవిచూశారు. ఇక చెప్పాలంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగే సత్తా ఉన్న నాయకుడిగా గుర్తింపుతెచ్చుకోగలిగారు. దీంతో కొడంగల్‌ ఎమ్మెల్యేగా ఓటమి చవిచూసినా.. మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థిగా విజయం సాధించారు.

ఇక ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌ తరఫున నల్గొండ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా ఓటమి భారంతో కుంగిపోకుండా లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. చెప్పాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారీ మెజార్టీతోనే గెలుపొందారు.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున కరీంనగర్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసిన బండి సంజయ్‌ భారీ తేడాతో ఓటమి చవిచూశారు. అయిన ఎక్కడా నిరాశపడకుండా పార్టీ అగ్రనాయకత్వం ఆశీస్సులతో కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. మోదీ అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాలే ప్రచార అస్త్రాలుగా ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేశారు. అయితే ఆయనకు స్థానికంగా మంచి పట్టు ఉండటంతో తన గెలుపు నల్లేరుపైనడకలా మారింది. దీంతో కరీంనగర్‌ కోటపై కాషాయ జెండా ఎగురవేశారు బండి సంజయ్.

తెలంగాణలో కమలదళానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న కిషన్‌రెడ్డి మరోసారి సత్తా చాటారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అయినా పట్టు వదలకుండా పార్టీకేడర్‌ను ఉత్సాహపరుస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అది గుర్తించిన కమలదళం సిట్టింగ్‌ ఎంపీ బండారు దత్తాత్రేయను పక్కనపెట్టి కిషన్‌రెడ్డిని సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలో దించింది. కిషన్‌రెడ్డికి ఉన్న గుర్తింపుతో పాటు, సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీకి ఉన్న పట్టుతో ఆయన విజయం సాధించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *