దక్షిణాది గండం... తూర్పుకు దండం...ఉత్తరాదే ఉత్తమం..

దక్షిణాది గండం... తూర్పుకు దండం...ఉత్తరాదే ఉత్తమం..

ఇది భారతీయ జనతా పార్టీ పరిస్థితి. దేశవ్యాప్తంగా కమలనాథులకు కాలం కలిసి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఇన్నాళ్లూ ఉత్తరాదిలోనే తాము బలంగా ఉన్నా…ప్రధానిగా నరేంద్ర మోదీ అధికార పగ్గాలు పట్టిన తర్వాత తమకు కలిసి వచ్చిందని ఆ పార్టీ నాయకులు చెబుతూ వచ్చారు. అయితే, ప్రస్తుత పరిప్థితులను అంచనా వేస్తున్న రాజకీయ విశ్లేషకులు మాత్రం భారతీయ జనతా పార్టీకి దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈసారి కమలనాథులు ఒక్క స్థానంలో కూడా విజయం సాధించే అవకాశాలు లేవంటున్నారు. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ కు విభజన హమీలు అమలు చేయకపోవడంతో పాటు కీలకమైన ప్రత్యే్క హోదా విషయంలో బీజేపీ వెనుకడుగు వేయడమే అంటున్నారు. ఇక తెలంగాణలో అయితే అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని ఢీకొనే నాయకులు లేకపోవడం మరో కారణంగా చెబుతున్నారు. గత ఎన్నికలలో సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ విజయం సాధించి తెలంగాణలో తమ అస్థిత్వాన్ని కాపాడారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదని చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో మిగిలిన కేరళ, తమిళనాడుల్లో అయితే భారతీయ జనతా పార్టీకి ఒక్క స్ధానం కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదని చెబుతున్నారు. దీంతో భారతీయ జనతా పార్టీకి దక్షిణాది రాష్ట్రాలు గండంగానే మారుతున్నాయని అంటున్నారు.

దేశానికి తూర్పు రాష్ట్రాలుగా పిలుచుకునే చోట్ల కూడా భారతీయ జనతా పార్టీకి ఈసారి కలిసొచ్చే అవకాశాలు లేవని చెబుతున్నారు. అస్సాం, మణిపూర్, మిజోరాం, సిక్కిం వంటి రాష్ట్రాల్లో అక్కడక్కడ పార్టీని బలోపేతం చేసినా అది బీజేపి విజయానికి సరిపోయేలా లేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాలకు తూర్పు రాష్ట్రాల్లో సరైన ప్రతిఫలం దక్కేలా లేదని చెబున్నారు. దేశంలో రెండు ప్రధాన ప్రాంతాల్లో పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో కమలనాథుల ఆశలన్నీ ఉత్తరాది పైనే ఉన్నాయని అంటున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ లలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉందని, అక్కడ వచ్చే స్ధానాలపైనే భవిష్యత్ ఆధారపడి ఉందని అంటున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో స్నేహితులను అడ్డం పెట్టుకుని కొన్ని స్థానాలైనా దక్కించుకోవాలన్నది కమలనాథుల ఎత్తుగడగా చెబుతున్నారు. ఈ పరిస్థితులను చూసిన అధిష్టానం ఒక్క సీటు గెలిచిన పార్టీతోనైనా తాము కలుస్తామంటూ కొత్త రాగాలు తీస్తోందని చెబుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *