క్యారీబ్యాగ్ కోసం 3 రూపాయలు ఆడిగారా ? మీకు ఐదువేలు బాకీ పడ్డట్టే

క్యారీబ్యాగ్ కోసం 3 రూపాయలు ఆడిగారా ? మీకు ఐదువేలు బాకీ పడ్డట్టే

కాలంతో పాటు చాలానే మార్పులొచ్చేస్తున్నాయి. పదేళ్ల క్రితం వరకూ ఏ సాధారణ హోటల్‌కు వెళ్లినా మంచి నీళ్లను ఉచితంగానే ఇచ్చేవారు. ఇప్పుడైతే తీసుకున్న ఆహారంతో పాటు మంచినీళ్లకూ డబ్బులు చెల్లించాలి. ఈ సంస్కృతి మెట్రోపాలిటన్ నగరాల్లో మొదలై మారుమూల పల్లెల వరకూ చేరింది. ఒక్క ఆహారం విషయంలోనో కాదు… వినియోగదారులను దోచుకునేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ వ్యాపారస్తులు ఉపయోగించుకుంటున్నారు. ఎంత పెద్ద సంస్థ అయితే అంత ఎక్కువ దోచుకునేందుకు అవకాశాలూ ఉంటున్నాయి.

ప్లాస్టిక్ కవర్లను నిషేధించిన్నప్పటి నుంచీ… దాదాపు అన్ని వ్యాపార సంస్థలూ పేపర్ కవర్‌కు ప్రత్యేకమైన ధరను నిర్ణయిస్తున్నాయి. కట్టాల్సిన బిల్‌తో పాటుగా, అదనపు ధరనూ భరించాల్సి భారం వినియోగదారుడిపై పడుతోంది. మరికొన్ని సంస్థలైతే ప్లాస్టిక్ కవర్లను ఇస్తూనూ అదనపు డబ్బును వసూలు చేస్తున్నాయి. వీటిలో సూపర్ మార్కెట్లు, బట్టల షాపులూ, పెద్దపెద్ద షూమార్ట్లూ ఉన్నాయి. ఇదే సంస్కృతిని ఎంచక్కా ఫాలో అవుతూ వినియోగదారుడిని మోసం చేస్తున్న బాటా సంస్థకు కన్స్యూమర్ ఫోరమ్ మొట్టికాయలు వేసింది. అసలు ఈ విషయంలో వినియోగదారులకు ఎలాంటి హక్కులుంటాయి ? వాటిని ఎలా సాధించుకోవచ్చు? బాటా సంస్థ చెల్లించుకున్న పరిహారం ఏంటి? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.

అనగనగా ఓ కస్టమర్…

చండీఘర్ లోని ఒక బాటా షోరూం… పేపర్ కవర్ రూపంలో వినియోగదారులపై అదనపు భారాన్ని వేస్తోంది. అక్కడ వస్తువును కొనుగోలు చేసిన వారంతా తప్పనిసరై ఇబ్బంది పడుతూనే దానికీ డబ్బును చెల్లిస్తున్నారు. అయితే… ఓ అనగనగా కస్టమర్ మాత్రం ఈ పద్ధతికి ఎదురుతిరిగాడు. అతని పేరు దినేష్ ప్రసాద్. చండీఘర్ నివాసి. ఎంతో మంది కష్టమర్స్ లానే మనోడూ 402 రూపాయల విలువ చేసే వస్తువుని కొన్నాడు. ఆ తర్వాత పేపర్ కవర్ పేరుతో మరో మూడు రూపాయలు అదనంగా చెల్లించాడు. ఈ ఎక్స్‌త్రా బిల్లు విషయంలో ప్రసాద్ చిర్రెత్తిపోయాడు. నేరుగా కన్స్యూమర్ ఫోరంలో కేస్ ఫైల్ చేశాడు.

అలా తేల్చారు…
ఈ విషయాన్ని కన్స్యూమర్ ఫోరం సీరియస్‌గానే తీసుకుంది. వస్తువును అమ్మిన సంస్థే తప్పనిసరిగా, ఉచితంగా క్యారీ బ్యాగ్ నూ ఇవ్వాలని తేల్చి చెప్పింది. కేస్ వేయడానికి ప్రసాద్‌కు అయిన వెయ్యి రూపాయలనూ, కవర్ ఛార్జ్ మూడు రూపాయలనూ, కన్స్యూమర్ ఫోరంకి మరో ఐదు వేల రూపాయలనూ, ఈ తతంగమంతటిలో వినియోగదారుడు పడిన ఒత్తిడికి గాను మూడు వేల రూపాయలనూ బాటా సంస్థ చెల్లించాల్సిందిగా… కన్స్యూమర్ ఫోరం ఆజ్ఞను జారే చేసింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *