'NTR కథానాయకుడు’ మూవీ రివ్యూ

'NTR కథానాయకుడు’ మూవీ రివ్యూ

మనిషి ఎత్తు అయిదున్నర అడగులు, మనసు లోతు సముద్రం, ఆలోచన అనితరసాధ్యం… నటసార్వభౌమ బిరుదు, వెండి తెర ఇలవేల్పు ఇంటి పేరు… నిజాయతి, నిబద్దత, మొండితనం ఇంటి పేరు, ఇవన్నీ కలిసిన వ్యక్తి  ఎలా ఉంటాడు అనే ఆలోచన రాగానే మనకి గుర్తొచ్చే మొదటి పేరు, చివరి పేరు ‘ఎన్టీఆర్’.  ‘ఎన్టీఆర్’ పేరు మూడక్షరాలు, ఈ మూడక్షరాల పేరున్న వ్యక్తే వెండితెరపై నాలుగు దశాబ్దాల పాటు తెరపై దేవుడిలా వెలిగాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అసలైన ప్రజా నాయకుడిలా నిలిచాడు. ఇంతటి గొప్ప వ్యక్తి కథని, ఆ తారక రాముని చరితని తెరపై చూపించడానికి ఆయన కొడుకే ధైర్యం చేశాడు, అతనికి జాగర్లమూడి క్రిష్ కలిశాడు. కట్ చేస్తే ఎన్టీఆర్ మోస్ట్ ప్రెస్టీజియస్ గా తెలుగులో తెరకెక్కింది. రిలీజ్ కి ముందే ఉన్న భారీ అంచనాలని మోస్తూ ప్రేక్షకులని మెప్పించడానికి సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో దర్శన మిచ్చారు.

NTR Kathanayakudu Review

ఏనుగు కుంభస్థలాన్ని

భాగాలుగా తెరకెక్కిన ఈ ఎన్టీఆర్ లోని మొదటి భాగం కథానాయకుడు రిలీజ్ అయ్యింది, నందమూరి తారక రామారావు సినీ ప్రయాణం ఎలా మొదలయ్యింది, ఆయన సినిమా దేవుడిగా ఎలా మారాడు, రాజకియల్లోకి రావడానికి కారణాలేంటి? బయట గంభీరంగా కనిపించే ఎన్టీఆర్, పర్సనల్ లైఫ్ లో ఏం జరిగింది? ఆయనకీ బసవతారకమ్మకి మధ్య ఎలాంటి బంధం ఉండేది? చివరికి, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎలా వచ్చాడు అనేది చూపించడమే కథానాయకుడు ముందున్న ప్రధమ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని క్రిష్-బాలయ్యలు గురి చూసి ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్లు కొట్టారు. సినిమా మొదటి అంతా ఎన్టీఆర్ సినీ ప్రయాణం చూపించి, ఆయన వేసిన పాత్రలు గుర్తు చేస్తూ సాగుతుంది. సెకండ్ హాఫ్ లో సినీ ప్రయాణంతో పాటు రాజకీయంగా అడుగులు ఎలా వేశారు అనేది చూపించారు.

కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్

కాన్సర్ హాస్పిటల్ లో బసవతారకం, హరికృష్ణల మధ్య మొదలైన ఈ కథ, ఆమెకి కాన్సర్ చెప్తూనే కథనం మొదలుపెట్టి… వ్యక్తులని మార్చగలను కానీ వ్యవస్థని మార్చలేను కదా అనే డైలాగ్ తో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయించి, ఎన్టీఆర్ లోని నిజాయితితో పాటు ఆయన్ని కూడా పరిచయం చేశారు. ఇక నిమ్మకూరు నుంచి మద్రాస్ వచ్చిన నందమూరి తారక రామారావు,  చెన్నైలో ఎలాంటి కష్టాలు పడ్డాడు, మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది, కెరీర్ ఆసాంతం ఆయనకి అండగా నిలిచిన వ్యక్తులు ఎవరు? ఎవరెవరితో ఆయన కలిసి నటించాడు, సినిమా పట్ల ఎన్టీఆర్ కి ఉన్న నిబద్దత ఎలాంటి  సన్నివేశాలతో సినిమా ప్రయాణం సాగుతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ కి బసవతారకం మధ్యలో ఉండే బంధాన్ని, ఒకరి నిర్ణయాలని ఇంకొకరు గౌరవించే విధానాన్ని తెరపై అద్భుతంగా చూపించారు. ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్నార్ కి ఉన్న రిలేషన్ ఎలాంటిది, వాళ్లిద్దరూ ఎంత మంచి స్నేహితులు అనేది ఆడియన్స్ కి మళ్లీ గుర్తు చేశారు. ఏఎన్నార్ గా సుమంత్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మిగిలిన ప్రతి పాత్రలో కనిపించిన నటులు, వారి క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు. మిగిలిన నటీనటుల్లో చెప్పుకోవాల్సిన పేర్లు కళ్యాణ్ రామ్, రానా. హరికృష్ణ పాత్రలో కనిపించిన కళ్యాణ్ రామ్, తండ్రి గెటప్ లో ఒదిగిపోయాడు. హరికృష్ణతో ఉండే ఆవేశాన్ని, మాటలో ఉండే కటుత్వాన్ని కళ్యాణ్ రామ్ కరెక్ట్ గా పట్టుకున్నాడు. ఇక రానా కనిపించింది కాసేపే అయినా కూడా చంద్రబాబుని గుర్తు చేశాడు, హావభావాలు బాగా పలికించాడు.

NTR Kathanayakudu Review

బాలయ్య ప్రూవ్ చేశాడు…

ఇక అన్నగారి పాత్రలో, అదే నందమూరి తారక రామారావు పాత్రలో కనిపించిన బాలకృష్ణ… ఎన్టీఆర్ పాత్రకి న్యాయం చేశాడు, ప్రతి సీన్ లో ఎక్కడా ఓవర్ యాక్షన్ లేకుండా ఎంత సన్నివేశానికి ఎంత అవసరమో అంతే చేసి మెప్పించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ కి కొంచెం వయసు వచ్చిన తర్వాత తెరపై బాలకృష్ణ కాకుండా ఆ నందమూరి తారక రామారావు మాత్రమే కనిపిస్తాడు, వినిపిస్తాడు కూడా. ఎన్టీఆర్ బయోపిక్ కి, తన తండ్రి పాత్రకి తను మాత్రమే న్యాయం చేయగలడని బాలయ్య ప్రూవ్ చేశాడు. ముఖ్యంగా కృష్ణ పాత్రలో బాలకృష్ణ కనిపించినప్పుడు, ఆ సన్నివేశాన్ని తెరకెక్కించిన విధానం, ఆ సమయంలో వచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెస్తుంది. ఆ తర్వాత బసవతారకం పాత్రలో నటించిన విధ్యా బాలన్, భాష రాకున్నా అద్భుతంగా నటించింది. ఎన్టీఆర్-తారకమ్మ మధ్య వచ్చే సన్నివేశాల్లో ఆమె నటన చాలా కాలం పాటు గుర్తుంటుంది. కొడుకు చనిపోయినప్పుడు తారకమ్మగా విధ్యా బాలన్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తుంది, కంట తడిపెట్టిస్తుంది. ఒక గొప్ప పాత్రతో ఆమె తెలుగులో ఎంట్రీ ఇవ్వడం మంచి విషయం. సింపుల్ గా చెప్పాలి అంటే బసవతారకమ్మ గురించి బయట వారికి పెద్దగా తెలియదు, ఎన్టీఆర్ సినిమాలో విద్యాబాలన్ ని చూస్తే తారకమ్మ ఇలానే ఉంటుందా అనిపించేలా  ఆమె నటన కనిపించింది.

NTR Kathanayakudu Review

తెరపై చూపించాడు…

ప్రతి డిపార్ట్మెంట్ లోని టెక్నీషియన్స్ ఎన్టీఆర్ సినిమా కోసం తమ కంట్రిబ్యూషన్ ఇచ్చారు, ఔట్పుట్ ఇంత బాగా వచ్చిందంటే దానికి కారణం కచ్చితంగా వల్లే. బుర్ర సాయి మాధవ్ కలం పదును మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు, ప్రతి డైలాగ్ బాగా పేలింది. సాంగ్స్ విన్నపుడు పర్వాలేదు అనిపించిన కీరవాణి, తన పనితనం ఏంటో తెరపై చూపించాడు, సన్నివేశాన్ని ఎలివేట్ చేయడానికి తను ఇచ్చిన బీజీఎమ్ చాలా హెల్ప్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, అప్పటి పరిస్థితులకి తగ్గట్లు వేసిన సెట్స్ బాగున్నాయి, ఇలా చెప్పుకుంటూపోతే 24 క్రాఫ్ట్స్ లోని నిపుణులు  బెస్ట్ వర్క్ చేశారు. వీళ్లందరినీ ఒకేతాటిపై నడిపించిన కెప్టెన్, అదే మన క్రిష్ జాగర్లమూడికి ఈ కాంప్లిమెంట్స్ అన్నీ దక్కుతాయి. ఎన్టీఆర్ కథని చెప్పడంలో క్రిష్, మేకర్ గా తన సత్తా చాటాడు. అతని రాకతో కొత్త కల తెచ్చుకున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమా, క్రిష్ బెస్ట్ వర్క్ టిల్ డేట్ అని చెప్పొచ్చు. అతను ఎన్నో హిట్ సినిమాలు చేసి ఉండొచ్చు కానీ ఎన్టీఆర్ సినీ ప్రయాణాన్ని, రాజకీయ జీవితాన్ని చూపించే క్రమంలో క్రిష్ చేసిన బాలన్స్ బాగుంది. సరిగ్గా మొదటి భాగాన్ని ఎక్కడ ఎండ్ చేయాలో అక్కడే ముగించిన క్రిష్, కథానాయకుడు సినిమాతో మహానాయకుడు చిత్రాన్ని ఎలివేట్ చేయడానికి తగినంత సమయం తీసుకొని ఎస్టాబ్లిష్ చేశాడు. ఈ క్రమంలో అక్కడక్కడా సినీ అభిమానులు డల్ గా ఫీల్ అవ్వోచ్చేమో కానీ అది కథన ప్రయాణం, ఒక వ్యక్తి జీవితం కాబట్టే, దాన్ని చూపించడానికి క్రిష్ అవసరమైనంత సమయాన్ని తీసుకున్నాడు. అక్కడక్కడా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నా కూడా రామారావు-బసవతారకమ్మ జీవితాన్ని తెరపై చూపించాలనే బాలయ్య నిర్ణయం చాలా గొప్పది, డబ్బు కోసం ఎక్కడా కమర్షియల్ హంగులకి పోకుండా, అతిగా గ్లోరిఫై చేసే డైలాగులు పెట్టకుండా, అన్నగారి పేరుతో డబ్బులు సంపాదించాలనే ఆలోచన పక్కన పెట్టి కథని కథగా మాత్రమే చూపించాలి అనుకున్న బాలకృష్ణ, ఇది తన అమ్మా-నాన్నకి ఇచ్చిన అసలైన ట్రిబ్యూట్… తారక రామారావ్, తెలుగు దేశం పార్టీ అనౌన్స్మెంట్ తో ఆగిపోయిన ఈ కథానాయకుడు.. మహానాయకుడు సినిమాని చూడాలి అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలిగించింది. మొత్తానికి అక్కడక్కడా కొన్ని హైస్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఎన్టీఆర్ సినిమాలోని మొదటి భాగం కథానాయకుడు ప్రతి సినీ అభిమానిని మెప్పిస్తుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *