లగడపాటి సర్వేతో ఎంతో మంది వీధినపడ్డారు : అయ్యన్న

లగడపాటి సర్వేతో ఎంతో మంది వీధినపడ్డారు : అయ్యన్న

టీడీపీలో రెబెల్ ఎవరైనా ఉంటే మొదటి పేరు విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుతోనే చెబుతున్నారు. ఆయన ధిక్కార స్వరంతో అధినాయకత్వానికే సవాల్ విసరగలరు. టీడీపీతో రాజకీయాల్లోకి వచ్చిన అయ్యన్నది కూడా రాజకీయ కుటుంబమే. ఆయన తాత లచ్చాపాత్రుడు అప్పట్లోనే క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. దాంతో ఆయన్ని తన పార్టీలో చేర్చుకునేందుకు అప్పట్లో అన్న ఎన్టీఆర్‌ రాయబారం చేశారు. అయితే తన మనవడికి అవకాశం ఇమ్మని లచ్చాపాత్రుడే కోరడంతో అయ్యన్న అనూహ్యంగా రాజకీయ ప్రవేశం చేశారు. మొదటి సారే టీడీపీ నుంచి గెలిచిన అయ్యన్న చిన్న వయసులోనే మంత్రి పదవి చేపట్టి ఆ హోదాలో పెళ్ళి చేసుకున్న నేతగా గుర్తుండిపోతారు. తాను చంద్రబాబు కంటే సీనియర్ అన్న మాట అనే ధైర్యం ఒక్క అయ్యన్నకే సాధ్యం.

ఇక టీడీపీలో మొదటి నుంచి ఉన్న వారిలో అయ్యన్న ఒకరు. అయితే ఆయన చాలా కాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారన్నది తెలుగు తముళ్ల వాదన. గత ఏడాది కాంగ్రెస్ తో కలసి తెలంగాణాలో టీడీపీ పోటీ చేయడం కూడా అయ్యన్నకు ఇష్టం లేదంటారు. ఇక ఏపీలో టీడీపీతో పొత్తు అంటే బట్టలూడదీసి జనం కొడతారు అని అయ్యన్న అనడం వెనక కూడా ఓ హెచ్చరిక ఉంది. దాన్ని అర్ధం చేసుకున్న అధినాయకత్వం ఆ ఆలోచన విరమించుకుంది. ఈ నేపధ్యంలో తాజాగా అయ్యన్న లగడపాటి సర్వే పేరుతో మరో మారు పెద్ద నోరు చేసుకున్నారు.

మరోవైపు లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకుడు. ఆయన చంద్రబాబుకు ఇటీవల కాలంలో బాగా చేరువ అయ్యారు. తాజా ఎన్నికల్లో ఆయన సలహా మేరకే చంద్రబాబు పార్టీ టికెట్లు అందరికీ కట్టబెట్టారని ప్రచారం కూడా ఉంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకుల సలహాలు బాబు విని టీడీపీని పాడుచేస్తున్నారన్న ఆవేదన సీనియర్లలో ఉంది. అయ్యన్న తాజాగా చేసిన కామెంట్స్‌ కూడా అది నిజం అనేలా ఉన్నాయి . లగడపాటి సర్వేను పనికిమాలిన సర్వేగా సీనియర్ నేత అయ్యన్న అనడం ఓ విధంగా సాహసమే. నిజానికి లగడపాటి సర్వే టీడీపీకి ఎంతో బూస్టింగ్ ఇచ్చింది. ఓ విధంగా ఏ సర్వే చెప్పని విధంగా మళ్ళీ అధికారం టీడీపీదేనని చెప్పుకొచ్చింది. అటువంటి సర్వేను చెత్త సర్వే అనడం ద్వారా అయ్యన్న తన కోపాన్ని పరోక్షంగా అధినాయకత్వం మీద చూపించారా అన్న చర్చ సాగుతోంది.

ఇక కింది స్థాయిలో ప్రజలతో సంబంధాలు పెట్టుకుని సర్వే చేస్తే బాగుంటుంది కానీ ఎక్కడో అంతస్తుల్లో కూర్చుని సర్వే చేయడమేంటని అయ్యన్న ప్రశ్నించారు. ఈ కామెంట్స్‌తో లగడపాటి సర్వేను బోగస్ అని తేల్చేశారు. అంతే కాదు, దీన్ని నమ్మి ఎవరూ మోసపోవద్దని కూడా పిలుపు ఇవ్వడం బట్టి చూస్తూంటే చంద్రబాబు మీద ఇండైరెక్ట్ సెటైర్లు ఉన్నాయని అంటున్నారు పొలిటికల్‌ ఎక్సపర్ట్స్‌. ఓ విధంగా పార్టీ పరిస్థితి చెప్పడమే కాదు, రానున్న రోజుల్లో తిరుగుబాటుకు అయ్యన్న సిద్ధంగా ఉన్నారని చెప్పేందుకే ఈ కామెంట్స్ చేశారని అంటున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *