దొంగతనానికి వెళ్తే.. సహాయం కావాలా అని అడిగిన యజమాని

దొంగతనానికి వెళ్తే.. సహాయం కావాలా అని అడిగిన యజమాని

దొంగతనానికి ఎవరైనా వస్తే పట్టుకుని నాలుగు తన్ని పోలీసులకు పట్టిస్తాం. ఆ అవకాశం లేకపోతే ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫోన్ చేసి సహాయం అడుగుతాం. వీటికి భిన్నంగా ఒక వ్యక్తి…తన ఇంటికి దొంగతనం కోసం వచ్చిన దొంగని ‘ఏమైనా సహాయం కావాలా?’ అడిగాడు. ఆశ్చర్యంగా ఉంది కదా! ఇది నిజం. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

లండన్‌లోని సిడెనాల్ వీధిలో ఈ సంఘటన్ జరిగింది. బిజినెస్ అనలిస్ట్‌గా పనిచేస్తున్న స్మిత్..తన కష్టంతో ఒక ఆడికారుని కొన్నాడు. ఇంట్లో పార్క్ చేయడానికి స్థలం లేకపోవడంతో ఇంటికి ఎదురుగా పార్క్ చేశాడు. బయట పార్క్ చేసుంది కాబట్టి దొంగల భయం ఉండకూడదని..ఇంటి ముందు కెమెరా కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కెమెరా ఉన్నచోటనే ఒక అలారం కూడా పెట్టించాడు. ఇంటి ముందు ఎవరైనా అనుమానంగా ఉండే వ్యక్తుల కదలికలు కనిపిస్తే…వెంటనే స్మిత్ ఫోన్‌కు మెసేజ్ వెళ్తుంది. శనివారం రోజున అర్ధరాత్రి పార్టీ చేసుకోవడానికని నైట్‌క్లబ్‌కు వెళ్లాడు స్మిత్. ఆ సమయంలో అతని ఇంటిముందు పార్క్ చేసిన ఆడి కారు వద్దకు ఒక దొంగ వచ్చాడు. కారు దగ్గర అలికిడి కాగానే స్మిత్ ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. వెంటనే ల్యాప్‌టాప్ తీసి ఎవరై ఉంటారో అని చెక్ చేశాడు.

చూస్తే…అతని కారుముందు దొంగ తిరుగుతుండటం కనిపించింది. కారు లాక్ ఓపెన్ చేయడం తెలీక తెగ కష్టపడుతున్న దొంగను చూశాడు. దొంగ కష్టాన్ని గుర్తించిన స్మిత్…వెంటనే ‘హాయ్..సహాయం కావాలా?’ అని అలారం ద్వారా వినబడేలా మాట్లాడాడు. ఎక్కడినుంచో మాటలు వినబడేసరికి దొంగ భయపడిపోయాడు. వెంటనే తేరుకుని పారిపోయాడు. ఆడీ కారు విలువ దాదాపు రూ.35 లక్షలపైనే ఉంటుంది. అలారం సెట్ చేయడం వల్లే ఇష్టపడి కొనుక్కున్న కారు దొంగతనం కాకుండా కాపాడుకోగలిగానంటూ సంతోషం వ్యక్తం చేస్తూ, దొంగ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు స్మిత్.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *