ఢిల్లీలో వేడెక్కిన ఎన్నికల వాతావరణం

ఢిల్లీలో వేడెక్కిన ఎన్నికల వాతావరణం

ఢిల్లీ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. ఆప్ అభ్యర్థి అతిషీని కించపరుస్తూ విడుదలైన పాంప్లెట్స్ వివాదం రాజేస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంబీరే ఆ పని చేశాడంటూ ఆప్‌ విరుచుకుపడుతోంటే… అదే స్థాయిలో కౌంటర్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఆయన. దీంతో రెండు పార్టీల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంతగా పరిస్థితులు నెలకొన్నాయి.

దేశ రాజధానిలో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఆప్ అభ్యర్థి ఆతిషికి వ్యతిరేకంగా పంపిణీ అవుతున్న పాంప్లెట్స్‌పై ఇంకా మంటలు చల్లారడం లేదు. ఈ వ్యవహారం వెనుక గౌతమ్‌ గంభీర్‌ ఉన్నారని ఆప్‌ నాయకులు ఆరోపించడంతో.. వాటిని ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఈ క్రమంలో తూర్పు ఢిల్లీ నియోజకవర్గం- బీజేపీ, ఆప్‌ నేతల విమర్శల, ప్రతి విమర్శలతో భగ్గుమంటోంది.

పాంప్లెట్లను పంచిపెట్టడం వెనుక తాను ఉన్నట్టు ఆప్ చేసిన ఆరోపణలను గంభీర్‌ కొట్టిపారేశారు. ఆ ఆరోపణలు నిజమని నిరూపిస్తే, పోటీ నుంచి తప్పుకుంటానని బహిరంగంగా ఉరేసుకుంటానని.. లేదంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజకీయాల నుంచి వైదొలుగుతారా.. అని సవాల్‌ విసిరారు.

మరోవైపు గంభీర్‌కు బీజేపీ నేతలతో పాటు ఇతర క్రికెటర్స్ నుంచి కూడా మద్దతు లభిస్తోంది. గంభీర్ గురించి తనకు బాగా తెలుసని.. ఏ మహిళ గురించి అతడు ఎప్పుడూ అసభ్యంగా మాట్లాడడు అంటూ క్రికెటర్ హర్భజన్ సింగ్ సపోర్ట్‌ చేశాడు.

మరోవైపు తూర్పు ఢిల్లీ ఆప్ అభ్యర్థి అతిషీ, ఢిల్లీ సీఎం అరవింద కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ శిసోడియాకు గౌతం గంభీర్ పరువు నష్టం దావా నోటీస్ పంపారు. తన మర్యాదకు భంగం కలిగిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. మొత్తానికి పాంప్లెట్స్‌ని ఎవరి కొట్టించారో తెలియదు కానీ ఢిల్లీ రాజకీయాలు మాత్రం గతంలో ఎన్నడూ లేనివిధంగా హీటెక్కాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *