నేతల బలహీనతను క్యాస్‌ చేసుకుంటున్న జ్యోతిష్యులు

నేతల బలహీనతను క్యాస్‌ చేసుకుంటున్న జ్యోతిష్యులు

దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల పైనే ఉంది. ఏపీ సీఎం చంద్రబాబుకీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీకీ మధ్య చిచ్చు రాజుకోవడంతో.. ఈ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి మరింత పెరిగింది. దీంతో కౌంటింగ్‌ రోజున ఏమవుతుందో అన్న టెన్షన్‌ చాలా మందిలో నెలకొంది. ఈ నేపథ్యంలోనే నేతల బలహీనతలను జ్యోతిష్యులు సొమ్ము చేసుకుంటున్నారా ? పండితుల చుట్టూ నాయకులు ఎందుకు తిరుగుతున్నారు ?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. ఎన్నికలకి ముందే టీడీపీ, బీజేపీల మధ్య యుద్ధం మొదలుకావడం అనూహ్య పరిణామం అయితే..ఈ ఎన్నికల్లో వైసీపీకి బీజేపీ, టీఆర్‌ఎస్‌ పెద్దల అండదండలు, జనసేన పార్టీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం, వందేళ్ల కాంగ్రెస్‌ పార్టీ ఏపీలో ఎలాంటి ప్రభావం చూపించని పరిస్థితిలో ఉండడం అనే అంశాలు ఉత్కంఠను కలిగించాయి. దీంతో పోలింగ్‌ ముగిసిన మర్నాటినుంచి ఎవరి లెక్కల్లో వారు మునిగి తేలుతున్నారు. ఏపీలో ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుంది? ముఖ్యమంత్రి కుర్చీ దక్కేది ఎవరికి? ఈ ప్రశ్నల చుట్టూ అందరి అంచనాలు కొనసాగుతున్నాయి. మా జగనే సీఎం అంటూ వైసీపీ నేతలు చెప్పుకుంటుండగా, మరోసారి చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి అంటూ టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఆ రెండు పార్టీలకు ఆక్సీజన్ అందించేది తామేనంటూ జనసేన పెద్దలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో ఒక స్పష్టత రావడం కోసం వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు జ్యోతిష్యుల వద్దకి వెళుతున్నారట.

అటు పండితులు సైతం ఈ పరిస్థితిని బాగానే క్యాష్‌ చేసుకుంటున్నారట. వచ్చిన వారిని కాదనకుండా, పాజిటివ్ కోణంలో మెప్పించి నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారట. తిథులు, వారాలు, గడియలు లెక్కేసి.. జాతకాలు తిరగేసి.. ఎవరికి తోచిన విధంగా వారు ఎవరికి రాజయోగం ఉందో చెబుతున్నారట. సదరు నేత పలానా తేదీన, ఫలానా స్థలంలో ప్రమాణస్వీకారం చేస్తారంటూ తేల్చేస్తున్నారట. వైఎస్ జగన్ జ్యోతిష్య చక్రంపై విశాఖలో ఆసక్తికర చర్చ సాగుతోంది. మే 25వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల 29 నిముషాలకు, ధనిష్ట నక్షత్రయుక్త కర్కాట లగ్నంలో సీఎంగా జగన్‌ ప్రమాణస్వీకారం చేస్తారన్న న్యూస్ చక్కర్లు కొడుతోంది.

ఈ అంశాన్ని కొందరు జ్యోతిష్య పండితులు కొట్టిపారేస్తున్నారు. జగన్‌ జాతకాన్ని పరిశీలిస్తే అతనికి కాలం కలిసిరావడం లేదన్నది వారి విశ్లేషణ. జ్యోతిష్య శాస్త్రంలో ప్రావీణ్యం ఉన్న పెద్దలు మాత్రం ఏపీకి మరోసారి సీఎం అయ్యేది చంద్రబాబే అని విస్పష్టంగా చెబుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి పీఠానికి పోటీపడిన చంద్రబాబు, వైఎస్‌ జగన్‌, పవన్‌కల్యాణ్‌ల జాతకాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే…. జగన్, పవన్‌ల కంటే మెరుగైన జాతకం చంద్రబాబుదే అని పలువురు పండితులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబుకి ఉన్న జాతక మహాత్యాలు ఆయనను ఎన్నో సవాళ్ల నుంచి గట్టెక్కించిందని మరికొందరు సిద్ధాంతుల విశ్లేషణ.

జ్యోతిష్య పండితులు చెబుతున్న ఈ మాటల్లో ఏది నిజం? ఏది అబద్ధం ? అన్న విషయం తేలాలంటే ఫలితాల రోజు వరకూ ఆగాల్సిందే. అయితే అప్పటివరకూ ఆగలేని వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు మాత్రం ఈ జోస్యాలను అడ్డుపెట్టుకుని రకరకాల చర్చలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *