ఫలితాలు రాకముందే పదవుల లెక్కలేసుకుంటున్న నేతలు!

ఫలితాలు రాకముందే పదవుల లెక్కలేసుకుంటున్న నేతలు!

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. పోలింగ్ సందర్భంగా ఇదివరకు లేనంతగా చాలా ప్రాంతల్లో దాడులు, ఘర్షణలు ఎక్కువయ్యాయి. పోలింగ్ ముగిసి నాలుగు రోజులు గడుస్తున్నా గొడవలు, కొట్లాటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగానే మరోవైపు పార్టీల్లోని నేతలు తమ పార్టీ గెలుస్తుందంటే తమ పార్టీ గెలుస్తుందని ఛాతీ విరుచుకుని చెప్పుకుంటున్నారు. ఎవరి లెక్కలు వారు వేసుకుని తమకు ఇన్ని సీట్లొస్తాయని ప్రకటించేస్తున్నారు. టీడీపీ నేతలు తమకు 130 స్థానాల్లో గెలిచి చూపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక వైసీపీ గురించి చెప్పే పనేలేదు. ఆ పార్టీలో ఏకంగా వైఎస్ జగన్ సీఎం అనే బోర్డు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసింది. ఇంకొన్ని రోజులు గడిస్తే తమ పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. వైసీపీలోని అన్ని వర్గాల్లో ఇదే ధోరణి కనబడుతోంది. ఇప్పటినుంచే తమ రాజకీయ భవిష్యత్తు బాగుండాలని రాబోయే అధికారంలో ఏ పదవి అయితే బాగుంటుందో చర్చించి ఆ పదవుల కోసం పైరవీలు కూడా మొదలుపెట్టారు. ఈ పదవీ వ్యూహాలు ఎవరికి వారు సొంతంగా ప్రయత్నిస్తుండటం విశేషం.

వైసీపీలోని కీలక స్థాయిలో ఉన్నటువంటి నేతలైతే తమ పార్టీ అధికారంలోకి వచ్చేసిందనే ఫీల్ అవుతున్నారు. వీరి ఉత్సాహానికి తోడు పార్టీ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశొర్ కూడా జగనే సీఎం అని ధీమాగా చెప్పడంతో నేతలందరూ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక తమకు ఏ పదవి అయితే భవిష్యత్తు బాగుంటుందో ఇప్పటినుంచే కసరత్తులు మొదలుపెట్టారు. ఈ విషయమై ఇప్పటినుంచే జగన్ వద్దకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పార్టీలోకి వచ్చిన తక్కువ సమయంలో కీలకమైన నేతగా ఎదిగిన రోజా ఈ అంశంలో అందరికంటే ముందున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తమ పార్టీ భారీ మెజారిటీతో గెలవడంతో పాటు తాను పోటీ చేస్తున్న నగరి నియోజకవర్గం నుంచి తనకు కూడా భారీ మెజారిటీ వస్తుందని గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే తనకు కీలక మంత్రి పదవి కూడా దక్కుతుందని ఆమె ఆశిస్తున్నారు. గతంలో వైఎస్ రాజశెఖర్ రెడ్డి హయాంలో సబితా ఇంద్రారెడ్డికి రాష్ట్ర హోమ్‌మంత్రిత్వ శాఖ ఇచ్చి పార్టీలో మహిళలకు ఎంతో గౌరవమిచ్చారని…కాబట్టి జగన్ కూడా తనకు హోమ్‌మంత్రి పదవి ఇస్తారని రోజా ఎన్నో ఆశలు పెట్టుకున్నట్టు తెలుసోంది. నాలుగేళ్లు ప్రతిపక్షంలో పార్టీ తరపున తాను ఎంత కష్టపడింది జగన్ గుర్తిస్తారని, కాబట్టి తనకు హోమ్‌మంత్రి పదవి కాకుండా ఏమిస్తారని తనవద్దకు వచ్చిన సన్నిహితులతో చెబుతున్నట్టు సమాచారం.

ఇక రోజాతో పాటు వైసీపీలోని ఉన్న మరికొంతమంది కీలక నేతలు సైతం తమకు ఏ మంత్రి పదవి కావాలో వాటి కోసం జగన్ వద్దకు రాయబారాలు పంపుతున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ నేతల ఉత్సాహాన్ని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. పార్టీ గెలవడం పక్కనబెడితే వైసీపీ పార్టీలో ఎంతమంది గెలుస్తారో చూసుకోవాలని టీడీపీ నేతలు సెటైర్‌లు వేస్తున్నారు. ఫలితాలు రాకముందే వైసీపీ అధినేత సహా పార్టీలోని అందరూ అధికారం కోసం ఎంత ఉబలాటపడుతున్నారో అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. జగన్ అధికారంలోకి రావడం అసంభవం అని, తాము మాత్రం 130 సీట్లు గెలవడం ఖాయమని, మళ్లీ అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

నేతల వ్యవహారమంతా గమనిస్తున్న ప్రజలు మాత్రం…అధికారం రావడం, ఏ పదవులు కావాలో కోరుకోవడం తప్పా ప్రజలకు చేయాల్సిన వాటి గురించి ఏ ఒక్క నాయకుడు మాట్లాడకపోవడం విషాదమని తమ బాధలను చెప్పుకుంటున్నారు. ఎవరి భవితవ్యం ఏంటో ఈవీఎంల్లోనే దాగుందని ఫలితాలు వచ్చే వరకు చూడాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *