కొణతాల, దాడికి దక్కని టికెట్లు...మొండిచేయి చూపిన ప్రధాన పార్టీలు

కొణతాల, దాడికి దక్కని టికెట్లు...మొండిచేయి చూపిన ప్రధాన పార్టీలు

విశాఖ జిల్లా రాజకీయాల్లో ఆ ఇద్దరూ పేరొందిన నేతలు.ఆ మాటకొస్తే ఉత్తరాంధ్రలోనే వారిరువురూ సీనియర్‌ నాయకులు.ఒకప్పుడు టీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేశారు.మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొన్నేళ్లుగా స్తబ్ధుగా ఉన్నారు.మళ్లీ ఎన్నికల వేళ చక్రం తిప్పాలని భావించిన ప్రత్యర్థులకు…ఛేదు అనుభవమే ఎదురైంది.ప్రధాన పార్టీల నుంచి టికెట్లు దక్కకపోవడంతో పరేషాన్ అవుతున్నారు.

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన…కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావుల రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.మధ్యలో రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఇధ్దరు నేతలు…ప్రస్తుత ఎన్నికల ద్వారా మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ చేపట్టాలని భావించారు.ఐతే, బద్ధ విరోధులిద్దరికీ ప్రధాన పార్టీలైన టీడీపీ,వైసీపీల నుంచి టికెట్ లభించలేదు.పోటీ చేయాలనుకున్న వీరి ఆశలకు గండిపడింది.2014 ఎన్నికల ముందు వైసీపీలో ఉన్న ఇద్దరు ప్రత్యర్థులు…ఆ తర్వాత పార్టీకి దూరమయ్యారు.ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో దాడి వైసీపీలో చేరగా,కొణతాల ఊగిసలాట ధోరణి అవలంభించారు.వీరిద్దరినీ కాదని రెండు పార్టీలు అనకాపల్లిలో మరొకరిని బరిలో దింపాయి.జగన్‌ అనకాపల్లి ఎంపీ టికెట్‌ను చివరి క్షణంలో సత్యవతికి కేటాయించగా…టీడీపీ అడారి ఆనంద్‌ను బరిలో దింపింది.

కాంగ్రెస్ లో సీనియర్‌ నేతగా వెలుగొందిన కొణతాల…తన రాజకీయ గురువైన వైఎస్‌ మరణానంతరం జగన్‌ వెంట నడిచారు.గత ఎన్నికల అనంతరం తలెత్తిన విభేదాల నేపథ్యంలో వైసీపీకి రాజీనామా చేశారు.ఆ తర్వాత ఉత్తరాంధ్ర చర్చావేదికగా ప్రజా సమస్యలపై వాయిస్ వినిపిస్తూ వచ్చారు.ఎన్నికలు రావడంతో అనకాపల్లి నుంచి టీడీపీ తరపున పోటీ చేయాలని భావించారు.ఐతే, అక్కడ టీడీపీ మరొకరికి అవకాశం కల్పించడంతో,ఆయన వైసీపీ తలుపు తట్టారు. ఈనెల 16న జగన్‌ను కలిశారు.ఏమైందో తెలియదుగానీ అక్కడ కూడా నిరాశ ఎదురైంది.వైసీపీ నుంచి టికెట్ దక్కకపోవడంతో ఇక కొణతాల అధికార టీడీపీలో చేరాలని డిసైడ్ అయ్యారు.

దాడి వీరభద్రరావుది అదే పరిస్థితి.గత ఎన్నికల ముందు వైసీపీలో చేరి,ఆ తర్వాత ఆపార్టీకి గుడ్ బై చెప్పిన దాడి…కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.ఈ ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా తనయుడిని బరిలో దింపాలని భావించి…జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.దాడి రత్నాకర్‌కు అనకాపల్లి సీటు ఓకే అయ్యిందని ప్రచారం కూడా జరగింది.కానీ, అనూహ్యంగా జగన్ వారికి ఝలక్ ఇచ్చారు. దీంతో,ఇప్పుడు దాడి కుటుంబం దారి ఎటువైపు అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

మరో మూడు వారాల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో….ప్రత్యర్థులిద్దరూ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *