పెంపు.. పెంపు.. పెంపు...

పెంపు.. పెంపు.. పెంపు...

జగన్ తొలి క్యాబినెట్ భేటీతో ఆంధ్రప్రదేశ్ లోని ఉద్యోగుల జీవితాల్లో వెలుగు వచ్చింది. ఇన్నాళ్లుగా చాలీచాలని జీతాలు, కడుపు నింపని వేతనాలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వస్తి పలికింది. ఆరు నెలల్లోనే మంచి ప్రభుత్వం తీసుకువచ్చాననే పేరు తెచ్చుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తొలి కేబినెట్ సమావేశంలోనే ఆ పేరు వచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్ళూ అన్నమో రామచంద్రా అంటూ గగ్గోలు పెట్టిన పారిశుద్ధ కార్మికుల వేతనాలను 18 వేలకు పెంచారు. గిరిజన ప్రాంతాల్లో హెల్త్ వర్కర్ గా పనిచేస్తున్న వారికి గత ప్రభుత్వంలో నాలుగు వందల రూపాయలు మాత్రమే జీతం. ఆ జీతాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.

ప్రభుత్వ నిర్ణయం.. ప్రజల హర్షం!

ప్రజల ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధను కనపరచండి అని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఆరోగ్య వ్యవస్థను చక్కదిద్దేందుకు తొలి కేబినెట్లోనే అడుగులు వేశారు. రోగులను ఆసుపత్రులకు తరలించే 104, 108 వాహనాలను కొనుగోలు చేయాలని, ఏ మారుమూల ప్రాంతం నుంచి ఫోన్ వచ్చినా ఇరవై ఐదు నిమిషాలలోగా ఆ ప్రాంతానికి చేరే విధంగా వాహనాలు అందుబాటులో ఉంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆరోగ్యశ్రీ తో సహా వైద్య అవసరాలకు సంబంధించిన భీమా వంటివి పునరుద్ధరించాలని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. అర్హత కలిగిన మహిళలకు ఇల్లు కట్టుకునేందుకు 200 గజాల స్థలాన్ని ఇవ్వాలని, ఆయా మహిళలకు ఉగాది నాటికి పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది నూతన ప్రభుత్వం. హోంగార్డుల జీతాలను పెంచడంతో పాటు వారికి ఉద్యోగ ఉద్యోగ భద్రతను కల్పించే అంశాలను కూడా సమావేశంలో చర్చించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ… ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై ఓ కమిటీని నియమించాలని, ఆ కమిటీ మూడు నెలల్లోగా నివేదిక అందజేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం నిర్ణయించింది. ఆ కమిటీ నిర్ణయాలను అనుసరించి ప్రభుత్వంలో విలీనం చేయడమా..? లేక దిద్దుబాటు చర్యలు తీసుకోవడమా..? అన్నది నిర్ణయిస్తారు. తొలి క్యాబినెట్ సమావేశంలోనే ప్రజలకు మేలు చేసే కీలక నిర్ణయాలు తీసుకున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభినందిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *