రైతు దినోత్సవం...రైతులకు వరాలు ప్రకటించిన ఏపీ సీఎం !

రైతు దినోత్సవం...రైతులకు వరాలు ప్రకటించిన ఏపీ సీఎం !

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా…ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి రైతులకు వరాలు ప్రకటించారు. రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల పాలనలోనే కొత్త పథకాలు తీసుకొచ్చామని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇకమీదట వైఎస్ జయంతి రోజున ప్రతి ఏడు రైతుదినోత్సవం నిర్వహిస్తామన్నారు.

గిట్టుబాటు…

రైతుల కోసం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని కూడా తెచ్చినట్టు చెప్పారు. ఈ పథకం కింద రూ.84వేల కోట్లు రైతులకు రుణాలివ్వాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. పంట రుణాలను గడువులోగా చెల్లిస్తే వడ్డీ ఉండదన్నారు. అన్నదాతల కోసం ఉచిత పంటలబీమా పథకాన్ని కూడా తెచ్చామని..ఆ ఇన్సూరెన్స్ కోసం రూ.2164 కోట్లు చెల్లిస్తుందన్నారు. ఒకవేళ రైతులు గనక పంట నష్టపోతే ప్రభుత్వమే బ్యాంకుల చుట్టూ తిరిగి భీమా డబ్బులు తెచ్చిస్తుందన్నారు. దీంతోపాటు గిట్టుబాటు ధరల కోసం రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. వేరుశెనగరైతులు, పామాయిల్ రైతులు, ఇతర రైతులకు తాము చేపట్టిన పథకాలను జగన్ వివరించారు.

పెన్షనర్లకు దిగులుండదు…

అర్హత ఉన్నా… పెన్షన్ జాబితాలో లేనివారు, పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. పెండింగ్‌లో ఉన్న 5లక్షల 40వేల మందికి కూడా పెన్షన్లు మంజూరు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రైతు దినోత్సవం సందర్భంగా జగన్… కడప జిల్లా జమ్మలమడుగులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. కొత్త పెన్షన్ విధానాన్ని ఆయన ప్రారంభించారు. సెప్టెంబర్ 1 నుంచే ఇంటింటికి పెన్షన్ ప్రారంభం అవుతుందని జగన్ ప్రకటించారు. అవ్వాతాతలకు నెలకు రూ.5వేలు, దివ్యాంగులకు రూ.3వేలు, డయాలసిస్ చేయించుకునే వారికి రూ.10వేల చొప్పున పెన్షన్ ఇస్తున్నట్టు చెప్పారు.

చట్టంలో మార్పులు

అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా పథకం ప్రారంభం అవుతుందన్నారు. ఈ పథకం ద్వారా 70లక్షల మంది రైతులు, 16 లక్షల మంది కౌలు రైతులకు కూడా లబ్ధి జరుగుతుందన్నారు. దీని కోసం రూ.8750 కోట్లు ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. ఇంత భారీ మొత్తంలో ఒకేసారి రైతులకు ఇవ్వడం దేశ చరిత్రలో ఎక్కడా లేదన్నారు. భూ యజమానులకు నష్టం లేకుండా, కౌలు రైతులకు లాభం జరిగే విధంగా.. కౌలు రైతుల చట్టంలో మార్పులు తెస్తామని జగన్ ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే చట్టంలో మార్పులు తీసుకొస్తామని చెప్పారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *