మూడు నిర్ణయాల ఏపీ క్యాబినెట్

మూడు నిర్ణయాల ఏపీ క్యాబినెట్

ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయాలను కూడా వేగంగా తీసుకుంటున్నారు. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశం అనేక తీర్మానాలు చేసింది. అందులో మూడు కీలకమైన అంశాలు ఉన్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది అందులో ఒకటి. ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీని వేయాలని నిర్ణయించారు. వీలైనంత త్వరగా ఇందుకు సంబంధించిన నివేదికను రూపొందించాలని ఆదేశించారు. ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయమేనంటున్నారు రాజకీయ పరిశీలకులు.

రైతులకు నిజమైన భరోసా!

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయగలిగితే కార్మికులకు ప్రభుత్వోద్యోగులతో సమానంగా అనేక ప్రయోజనాలు చేకూరే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక రెండవది రైతులకు ప్రతి ఎకరాకు ఉచితంగా బోర్లు వేయాలన్న నిర్ణయం. ఇందుకోసం ప్రభుత్వం నుంచే 200 బోర్ల వాహనాలను కొనుగోలు చేయాలని మంత్రి మండలి తీర్మానించింది. జియాలజిస్టుల ద్వారా సర్వే చేయించి కచ్ఛితంగా నీరు పడే చోటనే బోర్లు తవ్వించాలని భావిస్తున్నారు. ఇది కూడా అన్నదాతలకు అమితానందం కలిగించే విషయమే. వర్షాభావ పరిస్థితులలో రైతులు లక్షలాది రూపాయల ఖర్చుతో బోరుబావులు తవ్వించి ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వమే బోరుబావులు తవ్వించడమంటే వారికి సాంత్వన చేకూరినట్టేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

పోలీసుల కల నెరవేరే సమయం!!

ఒకవైపు రైతు భరోసా, మరోవైపు సాగునీటి సౌకర్యంతో వ్యవసాయానికి నిజంగా మంచి రోజులు వచ్చినట్టేనని అంటున్నారు. గౌరవ వేతనాలు పొందుతున్న అంగన్ వాడీలు, ఆయాలు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, హోంగార్డులకు వేతనాలు పెంచడం ద్వారా సీఎం జగన్ వారి మనసులను గెలుచుకున్నారని అంటున్నారు. అన్నింటి కంటే ముఖ్యమైనది పోలీసులకు వారాంతపు సెలవులు. రెండు మూడు రోజుల్లోనే ఇందుకు సంబంధించిన నివేదిక వస్తుందని, ఆ వెంటనే తుది నిర్ణయం తీసుకుంటామని డీజీపీ గౌతమ్ సావంగ్ ప్రకటించడంతో పోలీసు వర్గాలలో ఆనందం వ్యక్తమవుతోంది. ఇది కనుక అమలులోకి వస్తే దేశంలోనే విప్లవాత్మక సంస్కరణగా నిలుస్తుందని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పోలీసులు వీక్లీ ఆఫ్ కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారి కోరిక ముందుగా ఏపీలో నెరవేరబోతోందని అంటున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *