దుమారం రేపుతున్న పవన్ కళ్యాణ్ మాటలు

దుమారం రేపుతున్న పవన్ కళ్యాణ్ మాటలు

తెలంగాణ ఏర్పడి 5 ఏళ్లు అవుతోంది.ఇప్పటివరకు ఇక్కడ ఆంధ్రావాళ్ల మీద దాడులు జరిగినట్టు,వివక్ష చూపినట్టు ఒక్క సంఘటన కూడా లేదు.ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్ళకు బ్రాండ్‌గా వున్న ప్రాంతంలో ఆంధ్రా ప్రజానీకం టీఆర్ఎస్‌నే గెలిపించారు.ఎప్పుడు ఏ చిన్న కారణం దొరికినా అటు ఏపీ సీఎం చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్‌లు అసందర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. రాజకీయాలు కులాలతో ముడిపడకూడదని అన్నారు. భీమవరాన్ని హైదరాబాద్‌కు ధీటుగా విశ్వనగరంగా తీర్చిదిద్దుతానని అన్నారు. అంత వరకు బాగానే వుంది. ‘మనం ఇక్కడ మతాలుగా, కులాలుగా విడిపోయి కొట్టుకుంటున్నాం కానీ తెలంగాణ వాళ్లకు ఆంధ్రావాళ్లంటే అలుసు దళితుడు, క్షత్రియుడు, వైశ్యుడు అని ఏమీ లేదు, మనల్ని కొడుతున్నారు’ అని పవన్ నిస్సుగ్గుగా వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు.

మరోవైపు 20 ఏళ్ళ నుంచి తెలంగాణలోనే వుంటున్నానని పవన్ చెప్తున్నారు. మరి పవన్ మీద ఎన్ని దాడులు జరిగాయో చెప్పాలని నెటిజన్లు నిలదీస్తున్నారు. తన ఆస్తులను తెలంగాణవాళ్లు లాక్కుంటారేమో చూస్తానని పౌరుషంగా ఊగిపోయి మాట్లాడారు పవన్. ఇక్కడ రాష్ట్రం విడిపోయినా ఆంధ్రావాళ్ళను తెలంగాణా వాళ్ళు మునుపటి మర్యాదతోనే పిలుస్తున్నారు. వాళ్లతోనే అదే మంచితనంతో మెలుగుతున్నారు. ఇక్కడున్న ఆంధ్రా ప్రజలకు ఎలాంటి భయాలు లేవు. ఉన్నదల్లా పవన్ లాంటివాళ్లకే. ఎందుకంటే ఇప్పుడాయనకు ఆంధ్రా ఓటర్లు కావాలి కాబట్టి ఇలాంటి డైలాగులు పేల్చి ఆ సెంటిమెంటుతో తన పబ్బం గుడుపుకుందామని చూస్తున్నారని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు.

మరోవైపు తెలంగాణలో ఆంధ్రవాళ్లను కొడుతున్నారని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. పవన్ వ్యాఖ్యలు, ఆలోచనలు సరైనవి కావనే విషయాన్ని తెలియజేస్తున్నాయని కేటీఆర్ అన్నారు.

ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య వైష్యమాలు పెంచే విధంగా పవన్‌ చేసిన కామెంట్స్‌ సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *