శాతవాహన యూనివర్సిటీలో దుమారం

శాతవాహన యూనివర్సిటీలో దుమారం

శాతవాహన యూనివర్సిటీలో మావోయిస్టుల కార్యకలాపాల అంశం తీవ్ర దుమారం రేపుతోంది. రెండు రోజులుగా వర్సిటీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కలకలం కలిగిస్తున్నాయి. తొలుత ఈ గొడవను ఏబీవీపీ, తెలంగాణ విద్యార్థి వేదిక మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుగా భావించినా..తాజాగా పోలీసులు సరికొత్త అంశాలను తెరపైకి తీసుకొచ్చి వ్యవహారాన్ని కొత్త మలుపు తిప్పారు.

టీవీవీకి, మావోయిస్టులతో సంబంధాలు నిజమేనని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. అందులో పనిచేసే కొంతమంది తరుచూ చత్తీస్‌గఢ్‌ వెళ్లి మావోయిస్టు నేతలను కలుస్తున్నట్లుగా సమాచారం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇదే విషయమై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైనట్టు ఆయన గుర్తు చేస్తున్నారు.

మరోవైపు పోలీసుల చెప్తున్న వివరాలను తెలంగాణ విద్యార్థి వేదిక నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందే తమ సంస్థ పురుడు పోసుకుందని, తమపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని వారు మండిపడుతున్నారు.

ఇదిలా ఉంటే శాతవాహన యూనివర్సిటీ నుంచి గత నెల స్టడీ టూర్ పేరుతో 30 మంది విద్యార్థులు, ముగ్గురు ప్రొఫెసర్లు భద్రాచలం ,పశ్చిమగోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లారు. ఇందులో కొంతమంది రహస్యంగా మావో నేతలను కలిసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే సాధారణంగా వేసవికాలంలో అడవుల్లో మావోల సంచారముండదు. మరి పోలీసులు వారిపై ఎందుకు నిఘా పెట్టాల్సి వచ్చిందన్న వాదనలు విన్పిస్తున్నాయి.

కొంతకాలంగా సాయిబాబా ,వరవరరావులను విడుదల చేయాలంటూ టీవీవీ ఉద్యమిస్తోంది. ఫలితంగా మిగిలిన విద్యార్థులు కూడా మావో భావజాలానికి ఆకర్షితులవుతున్నారని పోలీసుల అనుమానంగా కనిపిస్తోంది. దీంతో ముందు జాగ్రతగా ఆదిలోనే టీవీవీ కార్యకలాపాలను కట్టడి చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.. ఈ క్రమంలోనే వారిపై అనుమానాస్పద కేసులు నమోదవుతున్నాయని కొందరి అంచనా. ఇందులో అసలు నిజానిజాలెంటో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *