శాతవాహన యూనివర్సిటీ లో మావోయిస్టు రాజకీయాల ప్రచారం?

శాతవాహన యూనివర్సిటీ లో మావోయిస్టు రాజకీయాల ప్రచారం?

శాతవాహన యూనివర్సిటీలో మావోయిస్టు పార్టీ కవర్ ఆర్గనైజేషన్ కలకలం సృష్టిస్తోంది. ఇటీవల ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాతతో పాటు మరో ముగ్గురు తెలంగాణ విద్యార్థి వేదికకి చెందిన విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నాగ్‌పూర్, పూణేలోని జైళ్లలో వివిధ కేసుల్లో ఉన్న ప్రొఫెసర్ జి.ఎన్‌.సాయిబాబా, విప్లవ కవి వరవరరావులను విడుదల చేయాలని కోరుతూ గత కొన్ని రోజులుగా తెలంగాణ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో కరీంనగర్‌లో ర్యాలీలు, సభలు, సమావేశాలు వంటి కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతుండడంతో ఈ సంఘంపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.మరోవైపు తెలంగాణ విద్యార్థి వేదికను మావోయిస్టు పార్టీ కవర్ ఆర్గనైజేషన్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యార్థినీ విద్యార్థుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని నిషిద్ధ మావోయిస్టు పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న తెలంగాణ విద్యార్థి వేదికలో సభ్యత్వాలు నమోదవుతున్నాయని చెబుతున్నారు. అంతేకాదు.. విద్యార్థి పోరాట వేదికని చెబుతూ అనేకమంది విద్యార్థినీ, విద్యార్ధులను ఈ సంస్థలో చేర్చుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.

వేదికకు నాయకులుగా పనిచేస్తున్న కొరివి సూర్యుడు, కరికె మహేష్, దొగ్గల రాజు.. మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు చంద్రన్నను కలిసి నిధులను తీసుకువచ్చారంటున్నారు పోలీసులు. మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ అని చెప్పకుండా శాతావాహన యూనివర్సిటీతోపాటు ఉమ్మడి జిల్లాలోని పలు విద్యా సంస్థలకు వెళ్లి సభ్యత్వాలను నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రొఫెసర్‌ సుజాత స్టడీటూర్ల పేరిట విద్యార్ధులను ఛత్తీస్ ఘడ్‌ సరిహద్దుల్లోని మావోయిస్టులతో సమావేశాలను ఆర్గనైజ్‌ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నారన్నారు.

దీంతో నక్సలైట్ బాధిత కుటుంబాల సంక్షేమ సంఘం విద్యార్థిని, విద్యార్థులకు పలు సూచనలు చేసింది. తీవ్రవాద సంస్థలకు అనుబంధంగా పనిచేసే సంఘాల్లో చేరకుండా.. జీవితాలను ఉజ్వలంగా తీర్చిదిద్దుకునేందుకు ముందుకు సాగాలని పిలుపునిచ్చింది. ఇక మీ పిల్లలుపై నిఘా పెట్టడమే కాకుండా ఎటు పయనిస్తున్నారో గ్రహించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు పలు సూచనలు చేసింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *