మహబూబ్‌నగర్‌ జిల్లాలో గుండు గీయించిన గ్రామ సర్పంచ్‌

మహబూబ్‌నగర్‌ జిల్లాలో గుండు గీయించిన గ్రామ సర్పంచ్‌

ఇంటి ముందున్న దూడను దొంగతనంగా తీసుకెళ్లి సంతలో అమ్మినందుకు ఇద్దరు యువకులకు గుండు గీయించారు. దీంతో మనస్తాపం చెందిన యువకుల్లో ఒకరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం ముచ్చింతల గ్రామంలో చోటు చేసుకుంది..

చిన్నచింతకుంట మండలం ముచ్చింతల గ్రామానికి చెందిన మహేశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌ వెళ్లి ఉద్యోగం చేస్తా..డబ్బులు ఇవ్వాలని తండ్రి సురేందర్‌రెడ్డిని కోరాడు. దీనికి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో నాలుగు రోజులు కిందట ఇంటి ముందు కట్టేసిన గేదె దూడను తన స్నేహితుడు రాజేందర్‌ సాయంతో దేవరకద్ర సంతలో అమ్మి… వచ్చిన డబ్బును ఖర్చు చేశాడు. దూడ కనిపించకపోవడంతో అనుమానంతో అతని తల్లిదండ్రులు మహేశ్వర్‌రెడ్డిని నిలదీయగా.. అసలు విషయం చెప్పాడు.. తన మిత్రుడు రాజేందర్‌ సాయంతో దూడను సంతలో విక్రయించానని తెలిపాడు. దీంతో ఆగ్రహించిన అతని తల్లిదండ్రులు ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్‌ హర్షిత, ఆమె భర్త, మాజీ సర్పంచ్‌ హర్షవర్దన్‌రెడ్డితోపాటు పలువురు గ్రామ పెద్దలకు చెప్పారు.

మరోవైపు ఇద్దరు యువకులు చేసింది..దొంగతనమని..భవిష్యత్‌లో మరెవరూ ఇలాంటి పనులు చేయకుండా ఉండాలంటే ఇద్దరికీ గుండు గీయించి గ్రామంలో ఊరేగించాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. అయితే ఇందుకు రాజేందర్‌ వ్యతిరేకించాడు. ఇందులో తన తప్పేమీ లేదని..కేవలం వెంట వెళ్లాను..దీనికే గుండు గీయిస్తే ఎలా అని గ్రామ పెద్దలతో వాగ్వాదానికి దిగాడు. అయినా వినకుండా ఇద్దరు యువకులకు గుండు గీయించారు.

ఇక ఈ అవమానం భరించలేక రాజేందర్‌ ఆత్మహత్య చేసుకునేందుకు పురుగుల మందు డబ్బాతో గ్రామ సమీపంలోని వాగు వద్దకు వెళుతుండగా..గమనించిన గ్రామస్తులు వెంటనే అతన్ని వారించి గ్రామంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించగా వారు గ్రామానికి చేరుకొని బాధితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాజేందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు 10 మంది గ్రామ పెద్దలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *